కడప జిల్లా కమలాపురం ప్రాంతంలో విస్తరించిన భారతి సిమెంట్స్ కర్మాగారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భూములిచ్చిన రైతులకు కనీస న్యాయం చేయలేదని , స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా శ్రమదోపిడీకి పాల్పడుతోందని ఇక్కడి ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను గాలికొదిలేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంపెనీ కేవలం లాభార్జనే ధ్యేయంగా సాగుతూ స్థానిక వనరులను కొల్లగొడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూముల సేకరణలో చీప్ పాలిటిక్స్.. వేల ఎకరాల కైవసం
భారతి సిమెంట్స్ ఏర్పాటు సమయంలో సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని రైతుల నుంచి సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో ఎకరాకు కేవలం కొన్ని వేల రూపాయలు మాత్రమే చెల్లించి అతి తక్కువ ధరకు రైతుల నోళ్లు కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ అండదండలతో సాగించిన ఈ భూసేకరణలో బాధితులకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదు. అటు రైతులు భూమిని కోల్పోయి ఇటు కంపెనీలో ఉపాధి దొరక్క అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. అభివృద్ధి పేరుతో జరిగిన ఈ భూ దోపిడీపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ పెరుగుతోంది.
లీజుల అక్రమ పర్వం.. రద్దు దిశగా సర్కారు అడుగులు
భారతి సిమెంట్స్ సంస్థకు సుమారు 528 హెక్టార్ల సుమారు 1,300 ఎకరాలు మేర సున్నపురాయి గనుల లీజులు కేటాయించారు. అయితే ఈ లీజుల అన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా రాయించుకున్నారు. అక్రమ మార్గాల్లో అనుమతులు పొందారని ఎన్నో ఏళ్లుగా న్యాయ పోరాటాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో అడ్డగోలుగా పొందిన ఈ లీజులను రద్దు చేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది.
వికాట్ వాటాల గుట్టు.. మేనేజ్మెంట్ అంతా జగన్ ఫ్యామిలీదేనా?
ఈ కంపెనీలో ఫ్రెంచ్ సంస్థ అయిన వికాట్ 51 శాతం వాటాలను కొనుగోలు చేసి 15 ఏళ్లు గడిచినా వారి ప్రతినిధులు ఎక్కడా కనిపించకపోవడం ఒక పెద్ద మిస్టరీగా మారింది. రికార్డుల్లో వికాట్ మెజారిటీ వాటాదారుగా ఉన్నప్పటికీ నిర్వహణ అంతా జగన్ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉండటం గమనార్హం. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థ నిర్ణయాల్లో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పెట్టుబడుల వెనుక ఉన్న లోగుట్టును విచారణ సంస్థలు లోతుగా పరిశీలించి గుట్టు తేల్చాల్సి ఉన్నా.. ఇంకా విచారణ సాగుతూనే ఉంది.
కోట్ల లాభాలు.. స్థానికులకు మాత్రం కాలుష్య కష్టాలు
భారతి సిమెంట్స్ ఏటా సుమారు 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో వందల కోట్ల రూపాయల నికర లాభాలను గడిస్తోంది. కేవలం సిమెంట్ అమ్మకాల ద్వారానే కాకుండా ప్రభుత్వ కాంట్రాక్టుల సరఫరా ద్వారా ఈ సంస్థ భారీగా లబ్ధి పొందింది. ఇంత లాభం వస్తున్నా పర్యావరణ పరిరక్షణ కోసం పైసా ఖర్చు చేయడం లేదనేది స్థానికుల ప్రధాన ఫిర్యాదు. కర్మాగారం నుంచి వెలువడే దుమ్ము, వ్యర్థాల వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా వ్యవహరించడంలో భారతి సిమెంట్స్ పూర్తిగా విఫలమైందనేది బహిరంగ సత్యం. జగన్ కుటుంబంపై అందుకే కడపలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
