నేను రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని.. రాజశేఖర్ రెడ్డి మీద కోపంతో నా మీద రాసుండొచ్చు అని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో రాసిన అంశాలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా భవన్ లో మీడియా సమావేశం తర్వాత జర్నలిస్టులు ఈ అంశంపై ప్రశ్నించారు. దీంతో స్పందించారు.
టెండర్ల నిబంధనల ఖరారు చేసేది సంస్థ.. మంత్రి కాదని ఆయన గుర్తు చేశారు. క్లిష్టతరమైన ప్రాంతాల్లో గనులుంటాయి కాబట్టి.. ఫీల్డ్ విజిట్ అనేది పెడతారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇటువంటి నిబంధనలు పెడతారు.. రాయడం కాదు తెలుసుకోవాలన్నారు. తాను రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిని కాబట్టి ఆ కోపంతో తనపై రాసి ఉంటారని.. ఈ విషయాన్ని నేను రాధాకృష్ణ తేల్చుకుంటాం.. ప్రజలకు నిజానిజాలు తెలియాలని అన్నారు.
నేను ఈ బాధ్యతలో ఉన్నంతవరకు ఏ గద్దలను రానివ్వనని అన్నారు. మీకు.. ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు.. మీ మధ్యలో ప్రజాప్రతినిధులను లాగొద్దు అని ఆర్కేకు భట్టి విక్రమార్క హితవు పలికారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు వెళ్లొద్దు.. ఎవరి గురించి నీచ నికృష్ట పనులు చేయించే వీక్ క్యారెక్టర్ తనది కాదన్నారు.
సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తులు.. బొగ్గు గనులు ప్రజల ఆత్మ.. ప్రజల ఆస్తులను కాపాడటమే తన లక్ష్యమన్నారు. ఆస్తులను సంపాదించడం కోసం.. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని విక్రమార్క తెలిపారు. నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం.. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చాననన్నారు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
