కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ప్రజాభవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చిస్తామని రాష్ట్రం పక్షాన పార్లమెంట్ లో, కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు.
డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరిని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను కూడా పిలిచారు. కానీ ఒక్కరు కూడా వస్తామని చెప్పలేదు. ఇది రాజకీయ పరమైన సమావేశం అని.. రాష్ట్రం కోసం కలసి పోరాడేందుకు కలసి రావడం లేదని నిందలేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశం అని బీజేపీ, బీఆర్ఎస్ అనుమానిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో హాజరు కాదు. బీజేపీ కూడా అంత కంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వ సమావేశానికి హాజరు కాదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ. అక్కడ నుంచి ఎలాంటి సమస్యలు లేవని రాష్ట్ర ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని అంటున్నారు. సమావేశం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ .. తెలంగాణ కోసం అందరూ కలసి కట్టుగా పోరాడటం లేదని అదే సమస్య అని వాదించే అవకాశం ఉంది.