రివ్యూ: భీష్మ‌

తెలుగు360 రేటింగ్‌: 3/5

సినిమాల వ‌ర‌కూ…
ఎలాంటి విష‌యాన్ని చెబుతున్నాం అనేదానికంటే..
ఎలా చెబుతున్నాం..? అనేదే ప్ర‌ధానం. ఎందుకంటే… వెండి తెర‌పై కొత్త క‌థ‌లు పుట్టుకురావు. ‘ఇది భూమి బ‌ద్ద‌లైపోయే క‌థ‌’ అని ఎవ్వ‌రూ గ‌ర్వంగా, న‌మ్మ‌కంగా, ధైర్యంగా చెప్పుకోలేరు. ఎందుకంటే అలాంటి క‌థ‌లు వెండి తెర‌పై ఎన్నో ఆడేసి, వెళ్లిపోయి ఉంటాయి. కాబ‌ట్టి… ఆ క‌థ‌ని ఎలా చెబుతున్నాం? ఎంత‌మందికి న‌చ్చేలా తీర్చిదిద్దుతున్నాం..? అనేదే ముఖ్యం. ప‌దార్థం ఏదైనా స‌రే, రుచిగా వండ‌డం – అత్య‌వ‌స‌ర‌మైన క‌మ‌ర్షియ‌ల్ సూత్రం. దాన్ని ప‌ట్టుకుంటే – ఎలాంటి క‌థైనా బాక్సాఫీసు ముందు జెండా ఎగ‌రేస్తుంది. సీరియ‌స్ విష‌యాన్ని సైతం…. న‌వ్వుతూ, న‌వ్విస్తూ, అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా, అర్థం చేసుకునేలా చెప్ప‌గ‌ల‌డం ఓ టెక్నిక్‌.

భీష్మ సినిమా వ‌ర‌కూ వ‌స్తే… ‘సేంద్రియ వ్య‌వ‌సాయం.. వాటి ప్రయోగాలు’ అనే పాయింట్ ప‌ట్టుకున్నాడు వెంకీ కుడుముల‌. నిజానికైతే… ఇది బోరింగ్ స‌బ్జెక్ట్‌. తీస్తే.. `మ‌హ‌ర్షి`లా తీయాలి. లేదంటే ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఫార్మెట్ ఎంచుకోవాలి. కానీ వెంకీ .. రెండూ చేయ‌లేదు. దానికి వినోదాల పూత పూసి, అస‌లు విష‌యాన్ని ఎక్క‌డో మ‌రుగున పెట్టి, దానిపై న‌వ్వుల రోడ్డు వేసి.. క‌థ‌ని వంద కిలోమీట‌ర్ల స్పీడుతో ప‌రిగెత్తించేశాడు. అదెలా జ‌రిగింది? మిగిలిన క‌థెలా న‌డిచింది…? తెలుసుకుంటే….

క‌థ‌

భీష్మ (నితిన్‌)…. పేరుకి త‌గ్గ‌ట్టే స్టిల్ బ్యాచిల‌ర్‌. డిగ్రీ ఫెయిలైపోయి ఆవారాగా తిరుగుతుంటాడు. క‌నీసం ఒక్క గాళ్ ఫ్రెండునైనా ప‌టాయించాల‌న్న‌ది త‌న ల‌క్ష్యం. కానీ ప్ర‌తీ అమ్మాయీ అందినట్టే అంది చేజారిపోతుంది. చివ‌రికి క‌మీష‌న‌ర్ కూతురు చైత్ర (ర‌ష్మిక‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న కోసం సేంద్రియ వ్య‌వ‌సాయంపై పుస్త‌కాలు చ‌దివేసి, దానిపై నాలెడ్జ్ పెంచుకుంటాడు. అలా పెంచుకున్న జ్ఞానాన్ని, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌ద‌ర్శించుకుని.. భీష్మ ఆర్గానిక్ కంపెనీకి తాత్కాలిక సీఈఓ అయిపోతాడు. 30 రోజుల్లో త‌న ప‌నితీరు న‌చ్చితే ఆ కంపెనీకి శాశ్వ‌త సీఈఓ అయిపోతాడు. లేదంటే బ‌య‌ట‌కు వెళ్లిపోతాడు. ఈ 30 రోజుల్లో కంపెనీని, త‌న ప్రేమ‌ని ఎలా కాపాడుకున్నాడు అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌

క‌థ ప్రారంభం నుంచి, చివ‌రి వ‌ర‌కూ.. ద‌ర్శ‌కుడు సినిమాటిక్ లిబ‌ర్జీ కావ‌ల్సినంత తీసుకుంటూ వెళ్లాడు. తొలి స‌న్నివేశం నుంచీ.. క్లైమాక్స్ వ‌ర‌కూ అడుగ‌డుగునా అది క‌నిపిస్తూనే ఉంటుంది. అమ్మాయి (హెబ్బా ప‌టేల్‌)ని ఏడిపిస్తూ పోలీసుల‌కు దొర‌క‌డం, క‌మీష‌ర్ ద‌గ్గ‌ర 30 రోజుల శిక్ష అనుభ‌వించ‌డం, ఓపెన్ డిబేట్‌లో మాట్లాడి అనంత‌నాగ్ మ‌న‌సు గెలుచుకోవ‌డం… ఇవ‌న్నీ అచ్చుగుద్దిన‌ట్టు సినిమా టిక్ లిబ‌ర్టీలే. త‌న‌కు అనుగుణంగా స్క్రిప్టుని రాసుకుంటూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు. కాక‌పోతే.. ఎక్కడా అది కంప్లైంట్ చేసేలా క‌నిపించ‌దు. దానికి కార‌ణం… ఈ విష‌యాన్నీ చెప్ప‌డానికి ద‌ర్శ‌కుడు ఎంచుకున్న దారి.

ఎలాంటి విష‌యాన్నైనా వినోద‌పు పూత పూసి చెబితే జ‌నానికి ఎక్కుతుంది. కాక‌పోతే ఆ వినోదం స్వ‌చ్ఛంగా ఉండాలి. క‌నీసం అందులోనైనా నిజాయ‌తీ చూపించాలి. వెంకీ కుడుముల అదే చేశాడు. చిన్న చిన్న ఎపిసోడ్ల‌లో న‌వ్వించుకుంటూ వెళ్లాడు. ఉదాహ‌ర‌ణ‌కు క‌మీష‌న‌ర్ (మిర్చి సంప‌త్‌)తో కూర్చుని మందు కొట్ట‌డం, వాళ్లిద్ద‌రి వాట్స‌ప్ వీడియో కాల్ ఎపిసోడ్‌.. ఇవి రెండూ బాగా పేలాయి. వాటి మ‌ధ్య వ‌చ్చే ఆర్గానిక్ వ్య‌వ‌సాయానికి సంబంధించిన స‌న్నివేశాలు బుర్ర‌కు ఎక్క‌క‌పోయినా, మ‌న‌సులో నాటుకోక‌పోయినా.. అవి సైతం పాస్ అయిపోతాయి. వెన్నెల కిషోర్ జీవితంతో… నితిన్ ఆడుకునే సంద‌ర్భం, సీఈఓగా మారిన త‌ర‌వాత ఉద్యోగుల‌లో మోటివేష‌న్ క‌ల్పించ‌డానికి ఇచ్చిన స్పీచు, కార్లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు వ‌చ్చిన `బుచుకు బుచుకు` ఎపిసోడూ, `300` వీరుడిలా అజ‌య్ అవ‌తారం… ఇవ‌న్నీ కావ‌ల్సిన‌న్ని న‌వ్వులు పంచేస్తుంటాయి. వాటి మ‌ధ్య ద‌ర్శ‌కుడు తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ని చెప్పేశాడు. ఈ సేంద్రియ వ్య‌వ‌సాయం, రైతులు క‌ష్టాలు, వాళ్ల ఆత్మ‌హ‌త్య‌లూ, క‌న్నీళ్లూ చెప్పుకుంటూ పోతే – ఈనాటి ప్రేక్ష‌కుడు వాటిని ఎంత వ‌ర‌కూ బుర్ర‌కు ఎక్కించుకుంటాడా? అనే భ‌యం ఉంటుంది. ఆ స‌న్నివేశాలేవో ఊక‌దంపుడు ఉప‌న్యాసాల్లా ఉంటే.. మొద‌టికే మోసం వ‌స్తుంది. కాబ‌ట్టి అలాంటి స‌న్నివేశాల్ని ఎక్క‌డ వ‌ర‌కూ వాడాలో అక్క‌డి వ‌ర‌కే వాడాడు. అవ‌స‌ర‌మైతే అక్క‌డా కామెడీ పండించ‌డానికే చూశాడు. దాంతో… ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది రెండో లేయ‌ర్‌గానే క‌నిపిస్తుంటుంది. ప‌తాక సన్నివేశాల్లో భారీ ఫైట్‌తో ఈ సినిమాని క‌మ‌ర్షియ‌ల్ కోణంలో ముగించొచ్చు. కానీ ద‌ర్శ‌కుడు ఆ ప‌ని చేయ‌లేదు. త‌న‌దైన ఫ‌న్నీ ట్రీట్‌మెంట్ ఇచ్చి.. థియేట‌ర్ నుంచి ప్రేక్ష‌కుడు హాయిగా న‌వ్వుకుంటూ బ‌య‌ట‌కు వెళ్లేలా చేశాడు.

అయితే ఈ క‌థ‌లో లోపాలేం లేవా అంటే.. ఉన్నాయి. ద‌ర్శ‌కుడు ఈ స్క్రిప్టుని చాలా సినిమాటిక్ ప‌ద్ధ‌తిలో రాసుకున్నాడు. కొన్ని ఫోర్డ్స్ ట‌ర్న్స్ క‌నిపిస్తాయి. అంత‌కు ముందే `ఐ ల‌వ్ యూ` చెప్పిన క‌థానాయిక‌… అప్ప‌టిక‌ప్పుడు హీరోని ఎందుకు దూరం పెడుతుందో అర్థం కాదు. అంత ప‌వ‌ర్‌ఫుల్ క‌మీష‌న‌ర్ బురిడీలామారిపోవ‌డం, విల‌న్ కూడా హీరో ఎత్తుల‌కు ఈజీగా చిత్త‌యిపోవ‌డం – ఇదంతా కాస్త విడ్డూరంగా అనిపించే విష‌యాలు. విశ్రాంతి ట్విస్టు బాగున్నా – ఆ త‌ర‌వాత‌ `ఇదంతా తూచ్‌` అని చెప్ప‌డం ద‌ర్శ‌కుడి ఎస్కేపింగ్‌. అయితే ఈలోపాల్ని కూడా వినోదాల ముసుగులో న‌డిపించేయ‌డం ద‌ర్శ‌కుడిలో ఉన్న టెక్నిక్‌. సో… అలాంటి ఎగుడు దిగుడుల ద‌గ్గ‌ర కూడా పాసైపోయాడు తెలివిగా.

న‌టీన‌టులు

నితిన్‌కి ఇలాంటి క‌థ‌లు భ‌లేగా సెట్ట‌యిపోతాయి. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం, అవ‌కాశం కూడా రాలేదు. ఆడుతూ పాడుతూ జాలీగా చేసుకుంటూ వెళ్లాడు. త‌న కాస్ట్యూమ్స్‌, లుక్స్ అన్నీ ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. ర‌ష్మిక య‌ధావిధిగా అందంగా క‌నిపించింది. స్టెప్పులు మాత్రం అద‌ర‌గొట్టేసింది. అనంత నాగ్ త‌న వ‌య‌సుకీ, హుందాత‌నానికీ త‌గిన పాత్ర‌లో క‌నిపించారు. విల‌న్ పాత్ర‌ధారి జేసుసేన్ గుప్తా.. ఆకట్టుకున్నాడు. హేమ చంద్ర వాయిస్‌లో త‌న న‌ట‌న చూస్తుంటే ధృవ‌లో అర‌వింద్ స్వామి గుర్తొస్తాడు. వెన్నెల కిషోర్ ఫ‌స్ట్రేష‌న్ న‌వ్వు తెప్పిస్తుంది. ర‌ఘుబాబు పంచ్‌లు చాలా కాలం త‌ర‌వాత పేలాయి. హెబ్బా ప‌టేల్ చిన్న పాత్ర‌లో క‌నిపించింది. అజ‌య్ కేమియో హైలెట్‌.

సాంకేతిక వ‌ర్గం

మ‌హ‌తి పాట‌లు ఇంకాస్త బెట‌ర్‌గా ఉండాల్సింది. పాట‌లు కూడా విడుద‌ల‌కు ముందే హిట్ అయితే.. ఈ సినిమా స్థాయి ఇంకోలా ఉండేది. యావ‌రేజ్ ఆల్బమ్‌ని జానీ మాస్ట‌ర్ స్టెప్పుల‌తో, క‌ల‌ర్‌ఫుల్ సెట్స్‌తో బాగా డెక‌రేట్ చేశారు. విజువ‌ల్స్ బాగున్నాయి. వెంకీ కుడుముల ప్ర‌తిభేంటో… ఛ‌లోతో అర్థ‌మైంది. ఇది త‌న‌ని మ‌రో మెట్టు ఎక్కించే సినిమా అవుతుంది. త్రివిక్ర‌మ్ శిష్యుడు కాబ‌ట్టి ఆ పంచ్ ప‌వ‌ర్ త‌న క‌లంలో క‌నిపించింది. చాలా చోట్ల ర‌చ‌యిత‌గా మ‌న‌సుల్ని గెలుచుకుంటాడు. త‌ప్ప‌కుండా వీటికంటే మంచి సినిమాల్ని, వినోదాన్నీ అందివ్వ‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు.

ఫినిషింగ్ ట‌చ్‌: పైనా కిందా ఊపు… ఈ సినిమానే తోపు

తెలుగు360 రేటింగ్‌: 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close