27వ తేదీ జగన్ తిరుమలకు వెళ్తారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. పై నుంచి వచ్చే పోస్టులను షేర్ చేసే వారందరూ.. జగనన్న తిరుమలకు అని పోస్టులు పెట్టారు. అంతా నిజమే అనుకున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్సించుకుని అక్కడ్నుంచి చెన్నైలో ఏదో ప్రైవేటు ప్రోగ్రామ్‌కు వెళ్తారని చెప్పుకున్నారు. కానీ హఠాత్తుగా అదంతా ఫేక్ అని తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తిరుమల పర్యటనకు జగన్ రావడం లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.
తిరుమలపై ఇష్టం వచ్చినట్లుగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జగన్ ఫ్యామిలీ, భూమన అంతా క్రిస్టియన్స్ అని.. మండిపడ్డారు. జగన్ ఫ్యామిలీ తలనీలాలు ఇచ్చి ప్రసాదం తిని.. శ్రీవారి దర్శనం చేసుకోవాలని సవాల్ చేశారు. ఈ అంశం హాట్ టాపిక్ గా మారడంతో జగన్ తిరుమలకు వెళ్లే ఆలోచన చేయాలని అనుకున్నారని చెబుతున్నారు. ముందుగా లీక్ ఇచ్చారు కానీ.. డిక్లరేషన్ అయితే అడగడం ఖాయమని తేలిపోవడంతో ఆయన వెనక్కి తగ్గారని చెబుతున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశం బయటకు వచ్చినప్పుడు తిరుమలకు వెళ్లాలని అనుకున్నారు. అప్పుడే డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయనను దర్శనానికి పంపించే అవకాశం లేకపోవడంతో ఆగిపోయారు. తాను నమ్మే దేవుడ్ని కాకుండా… మరో దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఇప్పుడు కూడా అంతే. ఆయన సీఎం హోదాలో.. బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించేవారు. అది కూడా ఒంటరిగానే సమర్పించేవారు. ఆయన శ్రీమతి ఎప్పుడూ తిరుమలకు రాలేదు. కానీ ఇంటి ముందు సెట్టింగ్‌లు వేసినప్పుడు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు.