పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. వచ్చే నెల రెండో తేదీలోపు హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ లోపు రవికుమార్ ఆస్తులు ఎవరెవరి పేర్లకు మారాయన్న విషయం దగ్గర నుంచి అసలు రాజీ విషయంలో ఏం జరిగిదన్న దాని వరకూ మొత్తం బయట పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిట్ నోటీసులు పంపింది. విచారణకు రావాలని ఆదేశించింది.
ఇటీవల ఫిర్యాదుదారు అయిన మాజీ విజిలెన్స్ ఆఫిసర్ సతీష్ కుమార్ .. అనుమానాస్పదంగా చనిపోయిన వెంటనే .. ప్రెస్ మీట్ పెట్టిన భూమన కరుణాకర్ రెడ్డి.. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధాకారం అని ప్రకటించేశారు. అంటే సతీష్ మృతిని ఆత్మహత్యగా నేరేటివ్ క్రియేట్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఎందుకలా చేశారో సిట్ అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది.
అలాగే దర్యాప్తులో బయటపడిన కొన్ని అంశాల విషయంలోనూ భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందన్నట్లుగా తేలినట్లుగా తెలుస్తోంది. ఓ దొంగ విషయంలో రాజీ చేస్తూంటే.. టీటీడీ చైర్మన్ కు తెలియకుండా జరుగుతుందని అనుకోవడానికి లేదు. అందుకే ఈ కేసులో కరుణాకర్ రెడ్డి కీలక వ్యక్తిగా ఉన్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడి అవుతాయేమో చూడాల్సి ఉంది.