మండలి షాక్..! ప్రభుత్వంపై చెరగని మరక..!

అధికారం ఉందని ఎలాగైనా తాము అనుకున్నది చేయగలమన్న ధీమా ఆంధ్రప్రదేశ్ అధికారపక్షానికి ఎవరెస్ట్ శిఖరం అంత ఉంది. శాసనమండలిలో బలం లేకపోవచ్చు కానీ.. అంతకు మించి చేతిలో.. పవర్ ఉందని అనుకున్నారు. అందుకే.. బిల్లుల విషయంలో ఎలాంటి మోహమాటలు పెట్టుకోలేదు. తీరా.. తెలుగుదేశం పార్టీ వ్యూంలో చిక్కుకుపోయారు. శాసనమండలి ప్రసారాలు కూడా నిలిపివేయాల్సి వచ్చింది. తమ అధికార అహంకారం ఎక్కడ బయట పడుతుందోనని కంగారు పడాల్సి వచ్చింది.

వ్రతం చెడింది.. ఫలితమూ దక్కని వైసీపీ..!

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేదు. ఆ విషయం ఆ పార్టీకి అధినేత సహా.. కింది స్థాయి కార్యకర్త వరకూ తెలుసు. కానీ.. చరిత్రాత్మక  బిల్లులంటూ.. ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులన్నింటినీ గతంలో.. మండలి ఆమోదించింది. దానర్థం.. మండలికి పవర్స్ లేవని కావు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనకుంటే.. అడ్డు పడకూడదనుకోవడమే. కానీ.. రాజధాని విషయంలో.. టీడీపీ.. ఓ స్టాండ్ మీద ఉంది. మూడు రాజధానులపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తోంది. ఇలాంటి సమయంలో.. టీడీపీ సభ్యుల్ని బుట్టలో వేసుకుని బిల్లును ఆమోదించుకుందామనుకోవడం అధికార పార్టీ నేతల అతి విశ్వాసానికి నిదర్శనం. దాని కోసం వారు సామ, బేధ, దాన దండోపాయాలను ప్రదర్శించారు. వారి వలకు చివరికి ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రమే దొరికారు. ఫలితంగా.. వ్రతం చెడింది.. ఫలితం దక్కలేదన్నట్లుగా పరిస్థితి.

ఆత్రం కాదు ‌అనుభవం ముఖ్యం..!

అధికారం ఉంది … ఎదురు వస్తే.. తొక్కేసుకుంటూ వెళ్లిపోతానని.. ప్రభుత్వ పెద్దలు అనుకున్నారు. కానీ.. అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి.. అసెంబ్లీ రూల్ బుక్‌ని.. సెక్షన్లతో సహా చెప్పగల విశేష అనుభవం ఉన్న యనమల.. ఆ అధికారానికి రూల్స్‌తోనే చెక్ పెట్టారు. ప్రభుత్వం ఊహించని విధంగా.. రూల్ నెంబర్ 71ని తీసుకొచ్చి అసలు బిల్లులు… మండలికి రాకుండా.. చేయడంలో సక్సెస్ అయ్యారు. పధ్నాలుగు మంది మంత్రులు వచ్చి.. స్పీకర్ పోడియాన్ని చుట్టి.. నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. యనమల … తీసుకున్న రూల్ నెంబర్ 71 స్టెప్ దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వారిని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అధికారపార్టీకి షాక్ ఇచ్చింది.  ఆత్రం కాదు.. అనుభవం ముఖ్యమన్న సెటైర్లు కూడా వినిపించాయి.

మంత్రులు పోడియంను చుట్టుముట్టిన రికార్డు..!

శాసనమండలిలోకి సభ్యులు కాని వాళ్లు వచ్చే అర్హత ఉంది.. మంత్రులకు మాత్రమే. అదీ కూడా వారు సమాధానాలు చెప్పడానికే. సభ్యులు కాని వాళ్లకు సభలో నిరసన తెలిపే హక్కు కూడా లేదు. కానీ.. పధ్నాలుగు మంత్రి మంత్రులు.. పోడియాన్ని చుట్టు ముట్టి.. మండలి చైర్మన్ పై.. తీవ్రమైన ఒత్తిడి చేశారు. నినాదాలు చేశారు. బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని చేసినా.. చివరికి ప్రభుత్వం.. చివరికి ఓటమి అంగీకరించలేదు. అధికారబలంతో.. రేపు మరేదైనా స్టెప్ వేయవచ్చేమో కానీ.. మంగళవారం మాత్రం.. ప్రభుత్వం ఘోరంగా ఓటమి పాలయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com