ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మంచి ప్రేక్షకాదరణ తో దూసుకెళ్తోంది. ఇటు సెలబ్రిటీల ని, అటు సామాన్యుల ని ఒకే సారి హౌస్ లోకి పంపించి, సామాన్యుల కి ఇంటి యజమానులు గా ప్రత్యేక అధికారమిచ్చి, సెలబ్రిటీలను సామాన్యుల కనికరం మీద హౌస్ లో కొనసాగాల్సిన పరిస్థితి ని సృష్టించి మొదటి ఎపిసోడ్ నుంచి “షో” ని రసవత్తరంగా మార్చేసారు బిగ్ బాస్ టీం. అయితే ఈ బిగ్ బాస్ కార్యక్రమాని కి, వివాదాలకి ఏదో ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంది అనే ఫీలింగ్ జనాల్లో ఉంది. ఈ సీజన్ కూడా ఇదే అభిప్రాయాన్ని బలపడేలా చేస్తుంది. వివరాల్లోకి వెళితే..
సెలబ్రిటీ హంగు + కాస్త కాంట్రవర్సీ రంగు = బిగ్ బాస్ హౌస్ లోప్రవేశానికి సక్సెస్ ఫుల్ ఫార్ములా
బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడం అనేది ఇవాళ సోషల్ మీడియాలో కాస్తో కూస్తో పేరు సంపాదించుకున్న ప్రతి ఒక్కరికి లక్ష్యంగా మారిపోయింది. అయితే “అవకాశాలు ఎవరికీ ఊరికే రావు”. మడిసన్న వాడికి కూసింత కళా పోషణుండాలి, బిగ్ బాస్ హౌస్ లోకి రావాలనుకుంటే- సెలబ్రిటీ అయినా సరే, సిన్నదో పెద్దదో ఏదో ఒక కాంట్రవర్సీ ట్యాగ్ అయి ఉండాలి అన్నట్టు తయారైంది బిగ్ బాస్ షో వ్యవహారం. గత సీజన్ లో శేఖర్ బాషా బిగ్ బాస్ లోకి వస్తాడా రాడా అన్న డౌట్ బిగ్ బాస్ ప్రేక్షకులకి కొంతకాలం ఉండేది. ఎప్పుడైతే రాజ్ తరుణ్ గాళ్ ఫ్రెండ్ తో శేఖర్ ఫైట్ ఆడియో కాంట్రవర్సీ అయి వైరల్ అయిందో అప్పుడే జనాలు ఫిక్సయిపోయారు – బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సారి ఈయన్ని వదలరు అని. మొదటి నుండీ ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూనే ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వేడి గా ఉన్నపుడు సీజన్ 1 లో ముమైత్ ఖాన్, నవదీప్ లు హౌస్ లోకి వస్తే, శ్రీ రెడ్డి ఇష్యూ పీక్స్ లో ఉన్నపు డు ఆవిడ పక్కన ఉన్న తమన్న సింహాద్రి సీజన్ 3 లో జాయినయింది. బాబు గోగినేని, షణ్ముఖ్, నోయెల్ లాంటి వాళ్ళందరూ హౌస్ లోకి రాక ముందు వాళ్ళ సెలబ్రిటీ హంగు కి కాస్త కాంట్రవర్సీ రంగు అంటించుకున్న వారే!! ఈ సీజన్ కంటెస్టంట్స్ కొందరు మరో సారి ఈ ఫార్ములా నిజమేనని నిరూపిస్తున్నారు.
సంజన:
హిందీ మర్డర్ కి రీమేక్ గా వచ్చిన గండ హెండతి అనే కన్నడ సినిమా ద్వారా, ఒరిజినల్ లో మల్లికా షరావత్ చేసిన పాత్ర తో పరిచయమై, మొదటి సినిమా లోనే బోలెడు బోల్డు సీన్లు చేసి, హీరోయిన్ గా “జాక్ పాట్” కొట్టి ఒకే దెబ్బకి “మాండ్యా టు ముంబై” పాపులర్ అయింది . తెలుగు ప్రేక్షకుల కి మాత్రం, బుజ్జిగాడు హీరోయిన్ గా, బుజ్జిగాడి “చిట్టి” చెల్లెలు గా గుర్తుండిపోయింది సంజన. ఆ మధ్య కర్ణాటక చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో సంజన పేరు ప్రధానంగా వినిపించడం తో మళ్ళీ “మాండ్యా టు ముంబై” ఈవిడ పేరు మారుమ్రోగి పోయింది. ఒకానొక సమయంలో తల్లి తో పాటు అరెస్టయి, దాదాపు మూడు నెలల సమయం జైల్లో గడిపింది సంజన. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రావడం, కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేయడం జరిగింది. ఏది ఏమైనా ఆ రకంగా వార్తల్లో నిలిచిన సంజన ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు నిర్వాహకులు. ఈ కేసు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Bigg Boss Telugu 9 Contestants’ Controversy: Sanjana Galrani’s Police Case Full Coverage
ఆశా షైనీ:
ఎప్పుడో 20 ఏళ్ల క్రింద తెలుగు సినిమాలు చేసిన ఆశా షైనీ ప్రస్తుత తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు అంటే అతిశయోక్తి కాదు. కానీ నరసింహ నాయుడు, ప్రేమ తో రా, నువ్వు నాకు నచ్చావ్ లాంటి హిట్ ల తో 2000 దశకంలో తెలుగు సినిమాల్లో “సెకండ్” హీరోయిన్ పాత్రలకు “ఫస్ట్” ఛాయిస్ గా మారింది ఈ లక్స్ పాప. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు బాలీవుడ్ లోని ఒక నిర్మాతతో సహజీవనం చేసింది ఆశా షైనీ. అయితే తల్లిదండ్రులతో సంబంధాలు తెంచుకొని మరీ అతని వద్దకు వెళ్లిన ఆశా షైనీ కి కొద్ది కాలంలోనే అతని నిజ స్వరూపం అర్థమైంది. విపరీతంగా కొట్టడం, చంపేస్తానని బెదిరించడం వంటివి శృతి మించడంతో ఒకానొక సమయంలో ఆయన వద్ద నుండి పారిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇది జరిగి చాలా సంవత్సరాల అయినప్పటికీ, అప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితులు, ఎమోషనల్ ట్రామా గురించి, ఇటీవలి ఇంటర్వ్యూల లో ఎక్కువ గా ఓపెనప్ అవుతోంది. ఈ నేపథ్యమే ఎప్పుడో మరిచిపోయిన ఆశాషైని మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడానికి కారణం అయిందని తెలుస్తోంది. ఈ కేసు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Bigg Boss Contestant’s Controversy: Asha Saini’s “Domestic Violence” Issue Full Coverage
రీతు చౌదరి:
జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా పాపులర్ అయిన రీతు చౌదరికి సోషల్ మీడియా లో అభిమానులు సబ్స్క్రైబర్స్ పుష్కలంగానే ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితం రీతూ చౌదరి పేరు ఒక ల్యాండ్ స్కాం లో వార్తల్లోకి రావడం సంచలనం సృష్టించింది. దాదాపు 700 కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూములను గత ప్రభుత్వ పెద్దలు ఒక రిజిస్ట్రార్ ద్వారా అక్రమంగా రీతు చౌదరి పేరు మీద వ్రాయించారని, ఆవిడ మరియు ఆవిడ భర్త చీమకుర్తి శ్రీకాంత్ గత ప్రభుత్వ పెద్దలలో కొందరికి బినామీలుగా వ్యవహరిస్తున్నారని టీవీ ఛానెల్స్ లో వచ్చిన వార్తలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, తనకి తన భర్తకి మధ్య విడాకుల వ్యవహారం కూడా నడుస్తుందని, తనకు ఈ భూముల సంగతులు తెలియదని రీతు చౌదరి వివరణ ఇచ్చుకుంది.
స్రష్టి వర్మ:
స్రష్టి వర్మ – పుష్ప తదితర చిత్రాల కొరియోగ్రాఫర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరచితమే. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అసిస్టెంట్ గా కెరియర్ ప్రారంభించి, ఒక సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గా కూడా నటించింది వర్మ. అదే జానీ మాస్టర్ మీద ఆ తర్వాత కాలంలో పోక్సో కేసు నమోదు కావడం, జైలుకు వెళ్లడం, తన జాతీయ అవార్డును సైతం వెనక్కి తిరిగి తీసుకోవడం వంటి అంశాలు మీడియాలో విపరీతంగా ప్రాచుర్యం పొందిన సమయంలో కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ వేదికగా స్రష్టి వర్మ పేరు వినిపించింది. ఈ కేసులో బాధితురాలు తనేనని, తనకు హీరో అల్లు అర్జున్ మద్దతుగా నిలిచాడని రకరకాల పుకార్లు కూడా వినిపించాయి. ఈ అంశం కోర్టులో నలుగుతున్న కారణంగా ఎక్కువ వివరాలు చర్చించడం సాధ్యం కాకపోవచ్చు కానీ, ఈ మొత్తం ఎపిసోడ్ లో వివాదాస్పదమైన అంశాల చుట్టూ తన పేరు మాత్రం బాగానే వినిపించింది . ఈ నేపథ్యంలోనే తను బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశించడం జరిగింది.
వివాదాస్పద వ్యక్తులంటే సహజంగానే అందరికీ కాస్త క్యూరియాసిటీ ఉంటుంది. వారు నిజంగానే ఆ వివాదం లో ఉన్నారా, అసలు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే ఆ ఆసక్తి ని క్యాష్ చేసుకోడానికి అన్ని మీడియా వర్గాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఇదే కోవలో ఈ ఫార్ములా అవలంబిస్తున్నారని అనుకోవచ్చు!!!
– జురాన్ (@criticZuran)