పాక్ తో యుద్ధం, ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 ఆగిపోయింది. ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌ని అర్థాంతరంగా ఆపేసి, ఆటగాళ్ల రక్షణే తమ ధ్యేయమని బీసీసీఐ చాటి చెప్పింది. ఆ తరవాత ఈ టోర్నీని నిరవధికంగా వాయిదా వేసింది. ‘వాయిదా’ అనే మాట వినగానే విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు పయనమయ్యారు. ఇప్పుడు ఉద్రిక్తత తగ్గింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. ఐపీఎల్ కొత్త షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.
మే 15 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఫైనల్ జరగాల్సివుంది. అయితే వారం రోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు జరక్కపోవడంతో ఈ షెడ్యూల్ మారొచ్చు. ఇంకా పదహారు మ్యాచ్‌లు జరగాలి. అవన్నీ 10 రోజుల్లో తేలే వ్యవహాం కాదు. కాకపోతే… విదేశీ ఆటగాళ్లని ఇప్పుడు వెనక్కి తిరిగి తీసుకురావడమే కష్టం. ఎందుకంటే దాదాపు 80 శాతం విదేశీ ఆటగాళ్లు తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. ఇక్కడ ఉన్నది 20 శాతమే. వాళ్లు కూడా ఈరోజో.. రేపో.. అన్నట్టు చూస్తున్నారు. తమ దేశాలకు వెళ్లిపోయిన ఆటగాళ్లని తిరిగి తీసుకురావడానికి ఫ్రాంచైజీలు చాలా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు ‘తిరిగి రావాలి’ అంటూ ఆటగాళ్లని కోరాయి. కానీ.. ఆటగాళ్లు మాత్రం ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ‘మే 25 దాటితే.. మేం ఐపీఎల్ లో కొనసాగలేం’ అంటూ ఆటగాళ్లు పరోక్షంగా ఫ్రాంచైజీలకు అల్టిమేట్టం జారి చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మే 25న ఫైనల్ జరగాలి. ఆ తరవాత ప్రతీ ఆటగాడికీ తమకంటూ ఓ షెడ్యూల్ ఉంటుంది. ముఖ్యంగా ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు వెనక్కి వచ్చేట్టు కనిపించడం లేదు. కొన్ని ఐపీఎల్ జట్లు విదేశీ ఆటగాళ్లని ఎక్కువగా నమ్ముకొన్నాయి. అలాంటి జట్లు ఇప్పుడు కష్టాల్లో పడినట్టే. ఏదోలా ఐపీఎల్ ముగిస్తే చాలు అనుకొంటే మాత్రం ఈనెల 15 నుంచి ఆట మొదలైపోతుంది. విదేశీ ఆటగాళ్లు కూడా కావాలంటే మాత్రం ఈ యేడాది సెప్టెంబరు వరకూ ఆగాలి. ఈ విషయంలోనే ఐపీఎల్ యాజమాన్యాలు తర్జనభర్జనలు పడుతున్నాయి.