బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్, నవంబర్‌లో జరగనున్నాయి. కూటములుగా బీజేపీ, ఆర్జేడీ పోటీ పడనున్నాయి. బీజేపీ, జేడీయూ ఓ కూటమిగా.. ఆర్జేడీ, కాంగ్రెస్ మరో కూటమిగా పోటీ పడనున్నాయి. ఇండీ కూటమిలో ఆర్జేడీనే అతి పెద్ద పార్టీ. కనీసం యాభై స్థానాల్లోపోటీ చేసే బలం కాంగ్రెస్ కు లేదు. అయినా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ బీహార్ నేతలు రచ్చ ప్రారంభించారు.
కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గెలిస్తే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ సీఎం అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే అధికారికంగా ప్రకటించడానికి మాత్రం కాంగ్రెస్ అంగీకరించడం లేదు. తేజస్వి యాదవ్‌ను సీఎం ఫేస్‌గా ప్రకటిస్తే ఇతర కులాలు దూరమవుతాయని కుంటి సాకులు చెబుతోంది. రాహుల్ గాంధీ ‘వోటర్ అధికార్ యాత్ర’లో తేజస్వి సీఎం అవుతారని ఎక్కడా చెప్పలేదు. ఎన్నికల తర్వాత సీఎం ఎంపిక ఉంటుందని బీహార్ కు వస్తున్న కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్ తీరుపై ఆర్జేడీ మండి పెడుతోంది. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీతో 2020లో 144 సీట్లు పోటీ చేసి 75 గెలిచింది. కానీ కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీలు గతంలో కేటాయించిన సీట్లలో అత్యధికం ఓడిపోవడంతో అప్పుడు అధికారం కోల్పోవాల్సి వచ్చింది.ఆ అంశం నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు కోరుతున్నారు. పైగా తేజస్వి పేరు ప్రకటించకుండా అడ్డుకుంటున్నారు.
ప్రత్యామ్నాయం లేకపోయినా తేజస్వి యాదవ్ పేరును సీఎంగా ప్రకటించడానికి బెట్టు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అలా అయితే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి ఎవరు అంగీకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లలేకపోతోందని కనీసం.. మిత్రపక్షాల బలాన్ని గౌరవించాలని అంటున్నారు. కానీ కాంగ్రెస్ అలాంటివి చేయదు కదా !
