రివ్యూ: బింబిసార

Bimbisara movie review telugu

తెలుగు360 రేటింగ్ :3/5

సోషియో ఫాంటసీ టాలీవుడ్ కి బాగా కలిసొచ్చిన జోనర్. పాతళ భైరవి నుంచి బాహుబలి వరకూ బోలెడు క్లాసిక్ చిత్రాలు ఈ జోనర్ లో ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. వెండితెరపై ప్రేక్షకుడికి అద్భుతాలు చూపించే జోనర్ కూడా ఇదే. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం పది శాతం కూడా అందుబాటులో లేని రోజుల్లోనే భైరవద్వీపంతో మాయ చేసిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమ సొంతం. అందులోనూ ఎపిక్ ఫాంటసీ అంటే వేరే ప్రపంచం. ఎపిక్ యాక్షన్ ఫాంటసీగా వచ్చిన బాహుబలి సరికొత్త చరిత్రని లిఖించింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ నుంచి మ‌రో ఫాంటసీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అదే- బింబిసార. ట్రైలర్, టీజర్ లో కొన్ని విజువల్స్ బాహుబలిని గుర్తు చేయడం ఆసక్తిని పెంచింది. కొత్త దర్శకుడు వశిష్ట‌ సృష్టించిన బింబిసార కథలోకి వెళితే..

క్రీస్తూపూర్వం 5వ శ‌తాబ్దం. త్రిగర్తల రాజ్యానికి రాజు బింబిసార (కళ్యాణ్ రామ్). క్రూరుడు, నియంత. అతడికి దయ, జాలి లేవు. అతడి మాటే మరణ శాశనం. సొంత సోదరుడైన దేవదత్త (కల్యాణ్ రామ్)నే రాజ్యం నుంచి బహిష్కరించే ఇష్టారాజ్యంగా పాలిస్తుంటాడు. త్రిగర్తల రాజ్యంలోని ధన్వంతరి పురం ఆయుర్వేదంకు ప్రసిద్ది. గాయపడిన కొందరు శత్రు దేశాల సైనికులకు ధన్వంతరి పురం ఆశ్రమిచ్చి వారికి వైద్యం అందిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బింబిసార ధన్వంతరి పుర వాసులని దారుణంగా చంపేస్తాడు. ఆయుర్వేద గ్రంధాన్ని తన నిధిలో దాచేస్తాడు. బింబిసారుడి ఆగడాలు మితిమీరడంతో సోదరుడు దేవదత్త మళ్ళీ రాజ్యానికి వచ్చి బింబిసారుడితో తలపడతాడు. ఇద్దరు సోదరులు పోరాడుతుండగా.. బింబిసారుడు ఒక మాయ దర్పణంలో పడిపోతాడు. అదొక టైం మిషన్ టైపు దర్పణం. ఆ దర్పణం గుండా ప్రయాణిస్తూ 2022కి వచ్చేస్తాడు. సుబ్రమణ్య శాస్త్రి పేరు మోసిన డాక్టర్. ఈ ప్రపంచమంతా తన గుప్పిట్లోకి తీసుకోవాలని కలలు కంటుంటాడు. అది సాధ్యం కావాలంటే బింబిసారుడి నిధిలో వున్న ఆయుర్వేద గ్రంధం అతనకి కావాలి. బింబిసారుడు ప్రస్తుతంలో ఉన్నాడని తంత్రం ద్వారా తెలుసుకుంటాడు సుబ్రమణ్య శాస్త్రి. తర్వాత ఏం జరిగింది ? ఆయుర్వేద గ్రంధం సుబ్రమణ్య శాస్త్రికి దక్కిందా ? గతం నుంచి ప్రస్తుతానికి వచ్చిన బింబికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? క్రూరుడైన బింబి మళ్ళీ మంచి మనిషిగా మారడా ? అనేది మిగతా కథ.

ఒక ఎపిక్ ఫాంటసీ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ బింబిసారలో వున్నాయి. ఈ కథ ఆలోచనే పర్ఫెక్ట్ ఫాంటసీ. బింబిసారుడనే రాజు వున్నాడు. అతని చరిత్రపై భిన్న అభిప్రాయలు, సమాచారం అందుబాటులో వుంది. చాలా క్రూరంగా వుండి రాజ్య కాంక్షే పరమావధిగా అతడు పాలన చేశాడని, తర్వాత రోజుల్లో మంచి మనిషిగా మారాడని, గొప్ప భక్తుడయ్యాడని, మిత్ర రాజ్యలతో సామరస్యంగా ఉన్నాడని, ఇతర రాజ్యాలతో స్నేహం పెంచుకోవడానికి అనేక వివాహాలు కూడా చేసుకున్నాడని.. ఇలా చాలా సమాచారం బింబి చరిత్రగా లభ్యమౌతుంది. అందులోంచి దర్శకుడు వశిస్ట్ ఓ కొత్త కోణం పట్టుకున్నాడు. క్రూరుడైన బింబి మంచి మనిషిగా మారడం వెనుక ఒక ఫాంటసీని ఊహించుకున్నాడు. నిజానికి ఆ ఫాంటసీ బావుంది. దాన్ని వెండి తెరపై తన శక్తి మేరకు ప్రజంట్ చేశాడు.

ఫాంటసీ సినిమాకి కావాల్సిన ప్రధాన లక్షణం.. తెరపై చూస్తుంది ఫాంటసీ అని తెలిసినా దాన్ని ప్రేక్షకుడు రియలిస్టిక్ గా తీసుకోవడం. ఇక్కడే సినిమా విజయం ఆధారపడివుంటుంది. ప్రేక్షకుడిని త్రిగర్తల రాజ్యంలోకి తీసుకెళ్లడం దర్శకుడి ముందున్న తొలి స‌వాల్‌. దాన్ని ఓపెన్ చేయడంలో ప్రేక్షకుడికి ఒక ఆసక్తి మొద‌ల‌వ్వాలి. బాహుబలిలో శివుడు జలపాతం అవతల ఏముంది ? అని తెలుసుకోవడానికి ఒక క్యూరియాసిటీతో ప్రయత్నిస్తుంటాడు. అదే ఆస‌క్తి ప్రేక్షకుడిలో కలుగుతుంది. బింబిసారలో మాత్రం.. బింబి కథపై ప్రేక్షకుడిలో ఇంకా ఆసక్తి క్రియేట్ అవ్వకుండానే హడావిడిగా ఓపెన్ చేసేయడం ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. బింబి క్రూరత్వం చూపించే సన్నివేశాలు ఆసక్తికరంగానే వుంటాయి. ఆయుర్వేద పురంలో జరిగే సన్నివేశాలు, బింబి నిధి, ఆయుర్వేద గ్రంధం, మాయ దర్పణం కథలో కీలకం. అయితే ఈ మూడు ఎలిమెంట్స్ ని చాలా లైట్ గా ప్రజంట్ చేశాడు దర్శకుడు. జగదీకవీరుడులో కేవలం ఉంగరం చుట్టూ బోలెడు ఫాంటసీ డ్రామా నడిపారు. ఎందుకంటే అదే కథని నడిపింది కాబట్టి. కానీ ఇందులో మాయ దర్పణంను డోర్ లేని గదిలా చాలా ఆసువుగా వాడుకోవడం ఫాంటసీని లైట్ చేసేసింది.

బింబి ఎప్పుడైతే ప్రసుత కాలానికి వచ్చాడో తర్వాత వచ్చే సన్నీవేశాలు యమలీల, ఘటోత్కచుడు ట్రీట్మెంట్ ని గుర్తుకు తెస్తాయి. బింబి వారసులుగా ప్రకాష్‌ రాజ్ పాత్ర ఎంట్రీ తర్వాత వచ్చిన ఇంటర్వెల్ బాంగ్ ఆసక్తికరంగానే వుంటుంది. అయితే ద్వితీయార్ధానికి వచ్చేసరికి ఒక సాధారణమైన కథ మారిపోతుంది. అత్యంత క్రూరుడైన‌ బింబికి సడన్ గా మానవత్వం గురించి తెలిసిపోవడం, మంచి మనిషిగా మారిపోవడం ఏమాత్రం సహజంగా వుండదు. బింబి నిధి చుట్టూ ఫాంటసీ డ్రామా నడిపితే ఫలితం మరోలా వుండేది. కానీ సాధారణమైన సన్నీవేశాలు, అవసరం లేని రెండు ఫైట్లతో క్లైమాక్స్ లోకి వచ్చేయడం ఆకట్టుకోదు. ఇలాంటి కథలకు ఇమాజినేషన్ ముఖ్యం. ఎంత ఇమాజిన్ చేస్తే అంత ఫాంటసీ వర్క్ అవుట్ అవుతుంది. పైగా దర్శకుడు కేవలం బింబి పాత్రపైనే సినిమాని నడపాలని భావించడం కూడా ఒక మైనస్. జగదీకవీరుడు అతిలోక సుందరి సినిమాని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా రాజు, ఇంద్రజ, మాంత్రికుడు,, ఇలా చాలా పాత్రలు కళ్ళ ముందు కదులుతాయి. బింబిలో మాత్రం బింబి తప్ప మరో పాత్ర బలంగా లేదు.

బింబిసార బరువునంతా మోశాడు కళ్యాణ్ రామ్ . పాత్రకు న్యాయం చేశాడు. ఫాంటసీ చిత్రం చేయడం కళ్యాణ్ రామ్ కి ఇదే తొలిసారి. బింబి పాత్రలో కళ్యాణ్ రామ్ ఆహార్యం, నటన ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ లో క్రూరత్వం పలికింది. కేథరిన్, సంయుక్త పాత్రల గురించి చెప్పడానికి పెద్దగా లేదు. నిజానికి సంయుక్త పాత్ర అనవసరం. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ పాత్రలు ఓకే. మాంత్రికుడిగా చేసిన ఆయప్ప ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

టెక్నికల్ గా సినిమా బావుంది. అయితే ట్రైలర్ చూపించిన బాహుబలి టైపు విజువల్స్ కేవలం ట్రైలర్ కోసమే అన్నట్టు తీసిన షాట్లే. చాలా సన్నివేశాల్లో సిజీలు అర్ధమైతాయి. కీరవాణి నేపధ్య సంగీతం బలాన్ని ఇచ్చింది. కొన్నిసార్లు విజువల్స్ ని కూడా డామినేట్ చేసింది. చిరంతన్ భట్, యాదగిరి, కీరవాణి చెరొక పాట చేశారు. ఐతే ఏ పాటా క్యాచిగా లేదు. కొత్త దర్శకుడు వశిస్ట్ తన తొలి చిత్రానికి ఫాంటసీ నేపధ్యాన్ని తీసుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. ప్రేక్ష‌కులు చాలా క‌న్‌ఫ్యూజ్ అయిపోయే క‌థ‌ని.. నీట్‌గా ప్ర‌జెంట్ చేశాడు. మంచి ఫాంటసీ ఎలిమెంట్స్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. పార్ట్ 2కి త‌లుపులు తెర‌చుకొన్నాయి కూడా. క‌ల్యాణ్ రామ్ త‌నకు అందుబాటులో ఉన్న బ‌డ్జెట్‌లో, త‌న‌దైన స్థాయిలో ఓ విజువ‌ల్ వండ‌ర్ చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. కొత్త ద‌ర్శ‌కుడు ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా.. ఓ ఫాంట‌సీ పాత్ర‌ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశాడు. కాల‌క్షేపం కోసం అయితే.. బింబిసార‌ని చూసేయ‌డానికి ఎలాంటి అభ్యంత‌రాలూ లేక‌పోవొచ్చు.

ఫినిషింగ్ ట‌చ్‌: కాస్త మాయ‌.. కాస్త థ్రిల్‌

తెలుగు360 రేటింగ్ :3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close