విపరీతంగా జనాభా పెరిగిపోతోందని చైనా ఒక బిడ్డ విధానాన్ని అవలంభించింది. ఎంతగా అంటే రెండో బిడ్డను కంటే చైనాలో చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన వచ్చేది. అది నేరంగా .. దేశద్రోహంగా కమ్యూనిస్టు పాలకులు చూసేవారు. కానీ భవిష్యత్ లో వచ్చే సమస్యల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడంతో ఇప్పుడు ప్రజల వెంట పడుతున్నారు. పిల్లల్ని కనాలని దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు. కానీ పిల్లల్ని కనడం, పెంచడం ఈ రోజుల్లో చైనాలోనూ తలకు మించిన భారం కావడంతో ఆ ఒక్క బిడ్డను కూడా వద్దనుకునేవారు ఎక్కువగా ఉన్నారు. దీంతో లక్షలు ఇస్తామని చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది.
చైనాలో జనాభా తగ్గుదల, వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పిల్లల జననాన్ని ప్రోత్సహించడానికి వివిధ ఆర్థిక ప్రోత్సాహకాలను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రెండవ బిడ్డకు జన్మనిస్తే సుమారు 6 లక్షల రూపాయలు, మూడవ బిడ్డకు 12 లక్షల రూపాయల వరకు నగదు ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. 2025 జనవరి 1 నుంచి జన్మించే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 3,600 యువాన్ (సుమారు 68,500 రూపాయలు) మూడు సంవత్సరాల పాటు ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది.
వివాహాల సంఖ్య తగ్గడం, ఉద్యోగ అవకాశాల కొరత, జీవన వ్యయం పెరగడం వంటి కారణాలతో యువత వివాహం, సంతానోత్పత్తికి దూరంగా ఉంటున్నారు. అందుకే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా.. పిల్లలను కనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. జనాభా పెరుగుదల రేటు తగ్గిపోతోంది. వృద్ధులు పెరిగిపోవడంతో చనిపోయేవారు ఎక్కువగా ఉన్నారు. పుట్టేవారు తక్కువగా ఉంది. అక్కడ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చేరే వారు లేకపోవడంతో వాటిని వృద్ధాశ్రమాలుగా మారుస్తున్నారని వార్తలొస్తున్నాయి.
చైనాలో జనాభా పెరుగుదల రేటు పెరగకపోతే ఆ దేశం అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశాలు వచ్చే రెండు, మూడు దశాబ్దాలలో ఉన్నాయి. భారత్ కూ ఆ ప్రమాదం ఉన్నా.. ముందస్తుగా మేలుకొన్న సూచనలు కనిపిస్తున్నాయి.