ముంబై మహానగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో బెంచ్ మార్క్‌గా మారుతున్నాయి. దశాబ్దాల కాలం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు తమ విభేదాలను పక్కనపెట్టి మరాఠీ అస్మిత నినాదంతో చేతులు కలిపినప్పటికీ, ముంబై ఓటరు మాత్రం వారి వైపు మొగ్గు చూపలేదు. తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ-ఏకనాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఠాక్రే సోదరుల ఐక్యత ముంబైపై వారి పట్టును తిరిగి తెస్తుందని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండటం గమనార్హం.
ముంబైపై దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగిన శివసేన ఆధిపత్యానికి ఈ ఫలితాలు గట్టి ఎదురుదెబ్బగా మారాయి. అభివృద్ధి మంత్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ నినాదంతో బీజేపీ ఓటర్లను ఆకట్టుకోగా, షిండే వర్గం అసలైన శివసేన తమదేనని నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఠాక్రే సోదరులు సెంటిమెంట్ కార్డును బలంగా ప్రయోగించినా, ముంబై ప్రజలు మాత్రం అభివృద్ధి , స్థిరత్వానికే పట్టం కట్టినట్లు కనిపిస్తోంది. కీలకమైన వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు భారీ ఆధిక్యతతో గెలుపొందడం ఆ పార్టీ బలాన్ని చాటుతోంది.
ఈ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముంబై లాంటి ప్రతిష్టాత్మక కార్పొరేషన్‌ను కోల్పోవడం ఠాక్రే కుటుంబానికి కోలుకోలేని దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమైంది. రాబోయే మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు తెరపడినట్లే. ముంబై బీజేపీ చేతుల్లోకి వెళ్తోంది.