దేశంలో ఏం జరిగినా దానికి నెహ్రూ కారణం అని బీజేపీ నేతలు ఆరోపిస్తూంటారనే సెటైర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా కొత్తగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఓ కొత్త ఆరోపణ చేశారు. అదేమిటంటే.. హిమాలయాల్లో ఇటీవల పెరిగిపోతున్నవిపత్తులకు కారణం నెహ్రూతో పాటు ఇందిర కూడా కారణమట. ఈ ఆరోపణలు కాస్త చిత్రంగా ఉన్నా.. ఆయన ఓ బేస్ కూడా దీనికి రెడీ చేసి వివరించారు.
చైనా 1960ల్లో అణుపరీక్షలు చేసినప్పుడు అమెరికా.. నిఘా పెట్టేందుకు ఇండియాలోని ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఓ శిఖరం అయిన నందాదేవిపై ఓ పరికరాన్ని తెచ్చి పెట్టారు. ఆ పరికరం ప్లూటోనియం శక్తితో నడుస్తుంది. దీన్ని పెట్టేందుకు నెహ్రూ అంగీకరించారు. ఇందిరా హయాంలోనూ ఈ ఆపరేషన్ జరిగింది. 1965లో భారత-అమెరికా బృందం పరికరాలను తీసుకెళ్లేం సమయంలో తీవ్ర మంచు తుఫాను వల్ల ఆ పరికరాలు గల్లంతయ్యాయి.
తర్వాత సీఐఏ వేరే వాటిని తెచ్చి పెట్టి తన పని తను చేసింది. కానీ ఆ గల్లంతయిన పరికం వల్లనే ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగా నది ఒడ్డున నివసించే ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పెరుగుతోందని బీజేపీ ఎంపీ ఆరోపిస్తున్నారు. హిమాలయాల్లో మంచు దిబ్బలు కరిగిపోవడం, క్లౌడ్ బరస్టులు, ఇళ్లలో పగుళ్లు రావడం వంటి సమస్యలకు కారణమని అంటున్నారు. కేదార్నాథ్ విపత్తు, తీస్తా నది వరదలు, గంగోత్రి-యమునోత్రి మంచు కరిగిపోవడం, గంగా నీటి మట్టం తగ్గడం వంటివి ఈ అణు పరికరాల లీకేజీ వల్లే జరుగుతున్నాయని వాదిస్తున్నారు. దీనికి కారణం ఉంది. నందాదేవి నుంచే గంగానది పుడుతుంది.
ఇప్పటి వరకూ గంగానదిలో రేడియేషన్ ఉందన్న సంగతి ఎప్పుడూ గుర్తించలేదు. కానీ చరిత్రలో ఉన్న ఓ సంఘటనను ఆధారంగా చేసుకుని విపత్థులకు..నెహ్రూకు.. ఇందిరకు ముడిపెట్టేశారు బీజేపీ ఎంపీ. వారంతే అనుకోవాలేమో ?
