బీజేపీ , కాంగ్రెస్ పార్టీల పనితీరును, సంస్థాగత నిర్మాణాలను పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆరెస్సెస్ నుండి వచ్చిన ఒక సాధారణ కార్యకర్త కూడా దేశ ప్రధాని కాగలరని, కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో జీవితాంతం ఉన్న ఆయనకు ఇప్పుడు ఈ విషయం తెలిసిందని అనుకోలేం కానీ.. బీజేపీ నిర్మాణం చూసి ఆయన అసూయ చెందుతున్నారని అనుకోవచ్చు.
సాధారణ కార్యకర్త ప్రధాని కావడమే బీజేపీ బలం!
భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థల్లో వంశపారంపర్య రాజకీయాలకు చోటు ఉండదు. అక్కడ కేవలం క్రమశిక్షణ, పనితీరు ఆధారంగానే పదవులు దక్కుతాయి. ఆరెస్సెస్‌లో ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన నరేంద్ర మోదీ నేడు దేశ ప్రధానిగా ఎదగడమే ఇందుకు నిదర్శనం. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే ఆశ, భరోసా బీజేపీ వ్యవస్థలో కనిపిస్తుందని, అదే ఆ పార్టీ విజయ రహస్యమని దిగ్విజయ్ వ్యాఖ్యల సారాంశం.
కుటుంబ రాజకీయాల నీడలో కాంగ్రెస్
దీనికి భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా కుటుంబ రాజకీయాల చుట్టూనే తిరుగుతోంది. పార్టీ పగ్గాలు గాంధీ-నెహ్రూ కుటుంబం చేతిలోనే ఉండటం వల్ల, కిందిస్థాయిలో కష్టపడి పనిచేసే నాయకులకు తగిన గుర్తింపు లభించడం ఉండదు. ఆ కుటుంబానికి వీర విధేయత ప్రకటించిన వారికే వీరతాళ్లు వేస్తారు. వారికి ప్రజాబలం ఉండాల్సిన పని లేదు. జైరాం రమేష్ లాంటి వాళ్లకు నియోజకవర్గం కూడా ఉండదు. కానీ పార్టీలో ప్రజాబలం ఉన్న నేతల్ని వారు డీల్ చేస్తారు. ప్రతిభ ఉన్నప్పటికీ, కుటుంబానికి విధేయులుగా ‘ ఉండేవారికే ప్రాధాన్యత దక్కడం వల్ల పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతూ వస్తోంది. ప్రజాబలం ఉన్న వాళ్లు ఎవరి దారి వారు చూసుకుంటూ పోవడం వల్ల కాంగ్రెస్ చిక్కిపోయింది.
కాంగ్రెస్ ఓ మాయా ప్రపంచం
బీజేపీ ఒక క్యాడర్ బే పార్టీగా కొనసాగుతుంటే, కాంగ్రెస్ క్రమంగా వ్యక్తుల చుట్టూ తిరిగే పార్టీగా మారిపోయింది. బీజేపీలో నిర్ణయాలు సామూహికంగా, సంఘ్ సిద్ధాంతాలకు అనుగుణంగా జరుగుతాయి. కానీ కాంగ్రెస్‌లో అధిష్టానం కనుసన్నల్లోనే అన్నీ నడుస్తాయనేది బహిరంగ రహస్యం. ఈ ధోరణి వల్ల సామాన్య కార్యకర్తకు , నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతోంది. పార్టీని బలోపేతం చేయాలంటే కుటుంబ రాజకీయాలను వీడి, ప్రజాస్వామ్యబద్ధంగా నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ అలా అనుకోదు.
బీజేపీలో కార్యకర్తకు ఇచ్చే గౌరవం, పదవుల ఎంపికలో చూపే పారదర్శకత ఆ పార్టీని పటిష్టం చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం వారసత్వ రాజకీయాల ఉచ్చులో చిక్కుకుని దిగజారుతోంది. కేవలం ఒకే కుటుంబంపై ఆధారపడటం వల్ల క్షేత్రస్థాయిలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. దిగ్విజయ్ లాంటి వాళ్లు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు.