భారత రాజకీయాల్లో సిద్ధాంతపరంగా లెఫ్ట్, రైట్ పార్టీలు కమ్యూనిస్టులు, బీజేపీ. రెండు పార్టీల్లో ఉన్నవారు ఉప్పునిప్పులా ఉంటారు. కానీ విచిత్రం బీజేపీ కమ్యూనిస్టుల క్యాడర్ ను తమలో కలిపేసుకుంటోంది. ఇదేం మాయ అని అందరూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
త్రిపుర, బెంగాల్ ..తర్వాత కేరళ
ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటలుగా ఉన్న త్రిపుర, పశ్చిమ బెంగాల్, ప్రస్తుతం కేరళలో బీజేపీ అనూహ్యంగా బలపడటం వెనుక ఒక పక్కా రాజకీయ మాయాజాలం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, త్రిపురలలో కమ్యూనిస్టుల పతనం తర్వాత క్షేత్రస్థాయి కేడర్‌కు రక్షణ కరువైన వేళ, అధికార తృణమూల్ కాంగ్రెస్ వంటి శక్తుల దాడులను తట్టుకోవడానికి వారు బలమైన ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆశ్రయించారు. కానీ కేరళలో మాత్రం భిన్నమైన వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది.
పేదల కడుపు నింపుతున్న మోదీ
కమ్యూనిస్టుల ఓటు బ్యాంక్ నిరుపేదలు. పోరాటాలు చేస్తారు కానీ ఆ ఫలితాలు వస్తాయో రావో తెలియదు.కానీ మోదీ.. ఆ పోరాటాలు లేకుండానే వారికి కావాల్సినవి సమకూరుస్తున్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమం అనే నినాదాలను బీజేపీ తనదైన శైలిలో అందిపుచ్చుకుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న ఉచిత బియ్యం, గ్యాస్ కనెక్షన్లు, పక్కా ఇళ్లు వంటి పథకాలు కమ్యూనిస్టుల సంప్రదాయ ఓటు బ్యాంకైన పేదలు, కార్మికులను సూటిగా ఆకర్షించాయి. దీనికి సాంస్కృతిక జాతీయవాదం తోడవడంతో, అంతర్జాతీయవాదం కంటే దేశభక్తి, భద్రత వైపు ప్రజలు మొగ్గు చూపారు. సిద్ధాంతాల కంటే దైనందిన జీవితంలో స్పష్టమైన మార్పును చూపడం ద్వారా బీజేపీ కమ్యూనిస్టుల పునాదులను కదిలించగలిగింది.
కేరళలో మారుతున్న సమీకరణాలు – హిందూ ఓట్ల విచ్ఛిన్నం
కేరళలో ఇప్పటికీ సీపీఎం, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు సాగుతున్నప్పటికీ, బీజేపీ ఓటు శాతం నిలకడగా పెరుగుతోంది. శబరిమల వంటి భావోద్వేగ అంశాలు, స్థానిక హిందూ ధర్మ రక్షణ నినాదాలతో కమ్యూనిస్టు అనుకూల హిందూ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధిస్తోంది. త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్టు పాలనను కూల్చిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తూ, మూడవ ప్రత్యామ్నాయం నుండి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. సామాజిక వర్గాల వారీగా ఓట్లను చీల్చడం ద్వారా కమ్యూనిస్టు పట్టును సడలించడం ఈ వ్యూహంలో భాగం.
ఆరెస్సెస్ కూడా కీలకమే!
కమ్యూనిస్టు నేతలు ప్రజలకు దూరమై, గ్రామాల్లో శూన్యం ఏర్పడిన చోట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖలు సేవా కార్యక్రమాల ద్వారా పాతుకుపోయాయి. గ్రామస్థాయిలో ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, కమ్యూనిస్టుల పనితీరును అధ్యయనం చేసి వారి ఎత్తుగడలనే చిత్తు చేస్తూ ఆరెస్సెస్ కార్యకర్తలు బీజేపీకి మార్గం సుగమం చేస్తున్నారు. ఈ పక్కా ప్రణాళికతోనే కమ్యూనిస్టులను బలహీనం చేస్తూ, వారి కోటల్లోనే బీజేపీ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ముందు ముందు కమ్యూనిస్టులు మరింత బలహీనపడటం ఖాయంగా కనిపిస్తోంది.
