కమలనాథుల్లో కనిపించని జోష్

దూకుడుగా చెలరేగడానికి ఎంతో అవకాశమున్నా… నిస్తేజంగా నీరసపడినట్టు కనిపిస్తున్న బీజేపీ మరోసారి వరంగల్ బరిలోకి దిగబోతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ పరిస్థితిని ఒకసారి గమనిస్తే, గత 17 నెలల్లో పార్టీ వ్యవహార శైలిని పరికిస్తే, కమలం పోటీ నామమాత్రమే అని వ్యాఖ్యానిస్తున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ పోటీ చేసింది. జిల్లా బీజేపీలో ఎంతో మంది నాయకులున్నా వారికి అవకాశం ఇవ్వలేదు. అంత క్రితం ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసి ఓడిపోయిన రామగళ్ల పరమేశ్వర్ ను ఏరికోరి నిలబెట్టారు. అభ్యర్థికి కేడర్ కనెక్ట్ కాలేదు. కేడర్ కు అభ్యర్థి కనెక్ట్ కాలేదు. అయినా పార్టీ కోసం పనిచేశారు. టీడీపీ తనవంతు మద్దతునిచ్చింది. అయినా బీజేపీ పోటీ నామ్ కే వాస్తేనే అయింది.

2014లో కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంది. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎదురుగాలే. అదే సమయంలో, ఎటు చూసినా మోడీ పేరు మార్మోగింది. మోడీ హవా, మోడీ సునామీ అని కమలనాథులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్ లో మాత్రం ఆ జోష్ అంతగా కనిపించలేదు. ఫలితం.. తెరాస అభ్యర్థి కడియం శ్రీహరి అతి భారీ మెజారిటీ విజయం సాధించారు. విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్ పార్టీయే రెండో స్థానంలో నిలిచింది. మోడీ హవాను క్యాష్ చేసుకోలేని బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. పైగా, ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల వివరాలను చూస్తే వరంగల్ బీజేపీ సత్తా ఏమిటో తెలుస్తుంది.

కడియం శ్రీహరి (తెరాస) 6,61,639 ఓట్లు సాధించారు. సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెస్) కు 2,69,065, రామగళ్ల పరమేశ్వర్ (బీజేపీ)కి 1,87,139 ఓట్లు వచ్చాయి. అంటే, విజేతకు, బీజేపీకి మధ్య దాదాపు 5 లక్షల ఓట్ల తేడా ఉంది.

పోనీ గత 17 నెలల్లో బీజేపీని అత్యంత పటిష్టంగా మలచడానికి తీవ్రమైన ప్రయత్నం జరిగిందా అంటే అదీ లేదు. తెలంగాణలోనే బీజేపీలో పెద్దగా జోష్ కనిపించదు. మోడీ ప్రధాని అయిన తర్వాత అనేక రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావాలని కసిగా కసరత్తు చేస్తున్నాయి. బెంగాల్లో తృణమూల్ తో ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలో మాత్రం అంతటి తీక్షణమైన దూకుడు కనిపిడచంల లేదు. వరంగల్ లోనూ అదే పరిస్థితి. కనీసం, కడియం శ్రీహరి మంత్రి అయ్యాక అయినా, ఉప ఎన్నిక ఖాయమని తెలిసిన తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్ర స్థాయిలో గట్టి ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు అభ్యర్థి ఎవరైనా అసలు విజయానికి కృషి చేయాల్సింది కేడర్. ఆ కేడర్ లో ఉత్సాహం నింపాల్సిన లీడర్లలో కొందరు మాత్రమే పట్టుదలతో కనిపిస్తున్నారు. అత్యధికులు సొంత పనుల్లో బిజీ అయిపోయారు.

ఈ దశలో టీడీపీ పోటీ చేసి ఉంటే పోటీ రసవత్తరంగా ఉండేదని కొందరు బీజేపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీలో కసి ఉందని, తెరాసను డీకొనాలనే తపన ఉందని వారంటున్నారు. తమ పార్టీ ఈసారి ఈ సీటును టీడీపీకి వదిలేస్తే అది సరైన నిర్ణయం అయి ఉండేదంటున్నారు. దీన్ని బట్టి, ఈసారి కూడా బీజేపీ వరంగల్ బరిలో ఉన్నా నామమాత్రమే అని కమలనాథులు పరోక్షంగా ఒప్పుకొన్నట్టే కనిపిస్తోంది. పరిశీలకుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఏమో, అంచనాలన్నీ తల్లకిందులై కమలం వికసిస్తుందేమో? చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]