ఈ విషయంలో భాజ‌పా గుర్రుగానే ఉంద‌ట‌!

తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంటుంది భాజ‌పాతో టీడీపీ అనుబంధం! రెండు పార్టీల మ‌ధ్య అధికారిక పొత్తు ఉన్నా.. ఎప్ప‌క‌టిక‌ప్పుడు తెగే దాకా లాగే ప‌రిస్థితిలు వ‌స్తూనే ఉంటాయి. తాజాగా మ‌రోసారి ఇదే చ‌ర్చ భాజ‌పాలో మొద‌లైన‌ట్టు స‌మాచారం. ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వ‌డంపై తెలుగుదేశం నేత‌లు చాలా విమర్శ‌లే చేశారు క‌దా! ఆర్థిక నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ కు ప్ర‌ధాని ఎలా టైమ్ ఇస్తారంటూ భాజ‌పాని కూడా ప్ర‌శ్నించారు. అలా టైమ్ ఇచ్చి ఉండ‌కూద‌న్న‌ట్టుగా ఏపీ మంత్రులు చెప్పుకొచ్చారు. అంటే, ప్ర‌ధాన‌మంత్రి ఎవ‌రిని క‌లవాలో ఎవ‌ర్ని కల‌వొద్దో కూడా టీడీపీ డిసైడ్ చేస్తుందా అన్న‌ట్టుగా టీడీపీ నేత‌ల కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడీ వ్య‌వ‌హార‌మై భాజ‌పాలో కొత్త చ‌ర్చ మొద‌లైన‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

జ‌గ‌న్ తో ప్ర‌ధాని భేటీని టీడీపీ ఎందుకంత తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంద‌నీ, ఈ విష‌యంలో మాదే త‌ప్పు అన్న‌ట్టుగా నేత‌లు మాట్లాడుతున్నారంటూ ఓ భాజ‌పా నేత ఆఫ్ ద రికార్డ్ వాపోతున్నార‌ట‌! ఆర్థిక నేర‌గాడికి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వ‌డ‌మేంటీ అనే మాట భాజ‌పాకి చిర్రెత్తేలా చేసింద‌ని అంటున్నారు! ప్ర‌ధాని ఎవ‌రితో మాట్లాడాలో కూడా టీడీపీ నేత‌లే డిసైడ్ చేస్తారా అంటూ భాజ‌పా నేత‌లు మండిప‌డుతున్నార‌ట‌. నిజానికి, టీడీపీ మంత్రుల తీరును భాజ‌పా నేత‌లు బ‌హిరంగంగానే త‌ప్పుబ‌ట్టారు. ఒక ప్ర‌తిప‌క్ష నేత పీఎంను క‌లుసుకోవ‌డంలో త‌ప్పేముందంటూ రాష్ట్ర భాజ‌పా నేత విష్ణుకుమార్ రాజు మొన్న‌నే మండిప‌డ్డారు. జ‌గ‌న్ కేసుల‌కూ, మోడీతో భేటీకి సంబంధం లేద‌ని సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా ఖండించారు.

అయితే, ఈ విష‌య‌మై రెండు పార్టీల మ‌ధ్య పంచాయితీ ఉండేలానే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు విదేశాల్లో ఉన్నారు. ఆయ‌న తిరిగి వ‌చ్చాక ఈ వ్య‌వ‌హార‌మై భాజ‌పాతో చ‌ర్చించాల్సిన ప‌రిస్థితి ఉంది. మంత్రుల కామెంట్స్ విష‌యంలో టీడీపీ ఒక మెట్టు దిగాల‌న్న ప‌ట్టుతో భాజ‌పా ఉన్న‌ట్టు స‌మాచారం. పైగా, ఈ ఎంటైర్ ఎపిసోడ్ లోకి కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు ఇంత‌వ‌ర‌కూ జోక్యం చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం టీడీపీ, భాజ‌పా నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఈ మాట యుద్ధానికి తెర‌ప‌డాలంటే చంద్ర‌బాబు రావాల్సిందే.

అయితే, ఈ నేప‌థ్యంలో మ‌రో అడుగు ముందుకేసి ఏపీ భాజ‌పా నేత‌లు తెగ‌తెంపులు మాట‌లాడుతున్నారు! తెలుగుదేశంతో వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ క‌లిసి కొన‌సాగొచ్చా లేదా అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుంటే మంచిదంటూ ఏపీ భాజ‌పా నేత‌ల అభిప్రాయంగా తెలుస్తోంది. మొత్తానికి, ప్ర‌ధానితో జ‌గ‌న్ భేటీ వ్య‌వ‌హారం టీడీపీ, భాజ‌పాల మ‌ధ్య కొత్త స‌మ‌స్య‌గా మారింది. చంద్ర‌బాబు వ‌చ్చాక ప‌రిస్థితులు ఎలా మార‌తాయో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com