ఆ విషయంలో భాజపాకి ఇప్పుడు స్పష్టత వచ్చిందా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో భాజపా నేతలలో చాలా మందికి మొదటి నుంచి కూడా తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం అసలు ఇష్టం లేదు. ఆ సంగతి వారి మాటలలో కనబడుతూనే ఉంటుంది. ఆంధ్రా, తెలంగాణా భాజపా నేతల అయిష్టతకి వేర్వేరు కారణాలున్నాయి.

తెలంగాణాలో నేతల అయిష్టతకి ప్రధాన కారణం అది ఆంధ్రాకి చెందిన పార్టీ అనే అభిప్రాయం కలిగి ఉండటమేనని చెప్పవచ్చు. అదీగాక వాపుని చూసి బలుపు అనుకొంటూ తెదేపాతో స్నేహం, దాని అండదండలు తమకి అవసరం లేదనుకొంటుంటారు. ఓటుకి నోటు కేసు తరువాత తెదేపా అప్రదిష్ట పాలవడంతో ఇంకా దూరం అయ్యారు. చివరికి గ్రేటర్ ఎన్నికల తరువాత దానికి పూర్తిగా దూరం అయ్యారు. ఆ తరువాత భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెరాసతో స్నేహానికి ప్రయత్నించారు. బహుశః భాజపా బుర్రలో ఆ ఆలోచన ఉన్నందునే తెదేపాకి దూరం అయ్యిందేమో? అనే అనుమానం కలుగుతోంది.

ఇక ఆంధ్రాలో భాజపా నేతలు తెదేపా పట్ల అయిష్టత చూపడానికి వేర్వేరు కారణాలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికలకి ముందు, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి భాజపాలోకి వచ్చి చేరిన వారందరూ మొదటి నుంచే తెదేపాని వ్యతిరేకిస్తున్నారు కనుక ఆ వ్యతిరేకతని నేటికీ కొనసాగిస్తున్నట్లు భావించవచ్చు. పురందేశ్వరి వంటి కొందరు నేతలు వ్యక్తిగత, కుటుంబ విభేధాల కారణంగా తెదేపా పట్ల వ్యతిరేకతని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. తెదేపా మంత్రులు, నేతలు కేంద్రప్రభుత్వం విమర్శలు చేస్తున్నందున కొందరు భాజపా నేతలు తెదేపాని వ్యతిరేకిస్తుంటే, మరికొందరు వాపుని చూసి బలుపు అనుకొంటూ వ్యతిరేకిస్తునట్లు కనిపిస్తుంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలతో తమ పార్టీ వైఖరి ఏమిటనే దానిపై ఎవరికీ స్పష్టత లేకపోవడం విశేషం.

వారిలో కొందరు అధికారపార్టీ నేతలు, మంత్రులతో అంటకాగుతుంటే, మరికొందరు విమర్శిస్తుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధాలు కూడా చక్కగా ఉన్నప్పటికీ, పార్టీల స్థాయిలో పరస్పరం విమర్శలు చేసుకొంటూనే ఉంటారు. భాజపా నేతలు ఈవిధంగా వ్యవహరించడం వలన చివరికి తామే నష్టపోతామని గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా నేతలకి అమిత్ షా డిల్లీలో క్లాసు పీకారని ఆంధ్రజ్యోతిలో ఒక కధనం ప్రచురించింది. అందుకే ఇప్పుడు తెదేపా పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల వారి వైఖరిలో చాలా సానుకూలమైన మార్పు వచ్చిందని దానిలో పేర్కొంది. ఆ కధనానికి ఆంధ్రజ్యోతి ఆధారం ఏమీ చూపలేదు కానీ తెదేపాని తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజు వంటి భాజపా నేతల స్వరంలో కొంచెం మార్పు మాత్రం కనబడుతోంది కనుక భాజపా అధిష్టానం తెదేపాని దూరం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని స్పష్టం అవుతోంది.

నిజానికి ప్రస్తుత పరిస్థితులలో తెదేపాతో కలిసి సాగడమే భాజపాకి అన్ని విధాల మంచిది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాట తప్పినందుకు ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న అది ఇప్పుడు తెదేపాని దూరం చేసుకొన్నట్లయితే, అప్పుడు తెదేపా కూడా దానికి మరో కొత్త శత్రువుగా మారుతుంది. దానిని సమర్ధంగా ఎదుర్కోగల సమర్ధులైన నేతలు భాజపాలో లేనప్పుడు అటువంటి ఆలోచనలు చేయడం కూడా చాలా ప్రమాదం.

అదేవిధంగా భాజపాకి తెదేపా అవసరం ఎంతుందో, తెదేపా ప్రభుత్వానికి కూడా ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడటానికి కేంద్రం అండదండలు అంతే అవసరం. కనుక రెండు పార్టీల నేతలు తమ భేదాభిప్రాయాలు, పంతాలు, పట్టింపులు అన్నీ పక్కన పెట్టి కలిసి సాగడమే వారికీ, రాష్ట్రానికీ కూడా మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]