జూబ్లిహిల్స్ అభ్యర్థిగా బలమైన నేతను ఎంపిక చేస్తామని బీజేపీ నేతలు చేసిన కసరత్తు అంతా తేలిపోయింది. చివరికి అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే ఖరారు చేశారు. ఈ సారి ఆయనను కాదని ఇంకా బలమైన అభ్యర్థిని నిలబెడతామని అనేక మందిని రేసులోకి తీసుకు వచ్చారు. చివరికి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, జయసుధ పేర్లను కూడా పరిశీలించారు. ఎవరూ ముందుకు రాలేదో.. ఎవర్నీ నమ్మలేకపోయారో కానీ చివరికి దీపక్ రెడ్డికే బీఫాం ఇవ్వాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ కాగా.. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఓట్లు. మజ్లిస్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తోంది. బీజేపీ మొదటి నుంచి ఈ ఉప ఎన్నిక విషయంలో నిర్లిప్తంగా ఉందన్న అభిప్రాయం ఉంది. ఉపఎన్నిక వస్తుందని తెలిసినా ప్రత్యేకంగా ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకోలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే అభ్యర్థి గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఫలితంగా పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే జరుగుతోందన్న అభిప్రాయం రావడానికి కారణంగా మారింది.
మద్దతు కోరితే ఇవ్వాలని టీడీపీ భావిస్తుంది. లంకల దీపక్ రెడ్డి గతంలో టీడీపీలోనే ఉండేవారు. ఆయనకు టీడీపీ క్యాడర్ మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనేతలు ఎంత మేర దీపక్ రెడ్డి కోసం పని చేస్తారన్నది ఆసక్తికర అంశంగా మారింది.