గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నేత. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన కర్ణాటక కల్యాణ ప్రజాపక్ష అనే పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరపున తనకు పట్టు ఉన్న బళ్లారి రీజియన్ లో అభ్యర్థులను నిలిపారు. కానీ గంగావతి నుంచి పోటీ చేసిన తాను ఒక్కడు మాత్రమే విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాడు. మళ్లీ లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీలో పార్టీని కలిపేసి బీజేపీ ఎమ్మెల్యేగా మారిపోయాడు.
ఇప్పుడు ఆయన బీజేపీ నేత.కానీ సీబీఐ కోర్టులో ఏడేళ్ల శిక్ష పడింది. ఇప్పుడు పదవి కూడా ఊడనుంది. వెంటనే అనర్హతా వేటు వేస్తారు. తర్వాత ఉపఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయ జీవితం మళ్లీ ముగిసిపోతుంది. ఆయన కుమారుడు కిరీట్ రెడ్డిని హీరోగా పెట్టి ఓ సినిమా చాలా కాలం క్రితం ప్రారంభించారు.ఎందుకే కానీ అది ఆగుతూ …సాగుతూ వస్తోంది. ఇటీవలే మళ్లీ షూటింగ్ ప్రారంభించారని అనుకున్నారు. కానీ గాలి జనార్ధన్ రెడ్డి జైలుకెళ్తే అది కూడా ఆగిపోతుంది. ఆయన కుటుంబంలోనూ వివాదాలు వచ్చాయని చెబుతారు.
గాలి జనార్దన్ రెడ్డికి చెందిన అనేక ఆస్తులు సీబీఐ జప్తు చేసింది. అవన్నీ ప్రభుత్వం జమ చేసుకుంటుంది. రాజకీయ అవసరాలు, కేసుల కోసం బీజేపీలో చేరినా మినహాయింపులు ఉండవని గాలి జనార్దన్ రెడ్డికి పడిన శిక్షనే తెలియచేస్తోంది. బీజేపీ కూడా గాలి జనార్ధన్ రెడ్డిని గతంలో చాలా సార్లు దూరం పెట్టింది. ఆయనను జాతీయ స్థాయిలో ఎవరూ ప్రోత్సహించకపోయినా.. రాష్ట్ర స్థాయిలో యడ్యూరప్ప లాంటి వారు అండగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన తో పాటు ఆయన కుటుంబసభ్యుల రాజకీయ జీవితం అంతం అయినట్లే అని అనుకోవచ్చు.