హైదరాబాద్‌లో రంజాన్ ఇఫ్తార్ విందులు ఇప్పుడు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రి సమీపంలో ఎంఐఎం నాయకులు ఏర్పాటు చేసిన సామూహిక ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నాయకురాలు మాధవీలత స్వయంగా చించిపడేశారు. ఆ విరించి ఆస్పత్రి ఆమె కుటుంబానిదే. ఈ ఫ్లెక్సీలు తమ ఆస్పత్రి ఎదురుగా పెట్టారని ఆమె చించేశారేమో కానీ కారణం మాత్రం వేరే చెబుతున్నారు. ఇఫ్తార్ విందులకు ఉన్న అర్థం చెబుతున్నారు.
ఇఫ్తార్ విందుల పేరుతో ఫంక్షన్ హాళ్లు, ఏసీ గదుల్లో కోట్లు ఖర్చు చేస్తూ ఆడంబరాలు ప్రదర్శించడం రంజాన్ పవిత్రతకు విరుద్ధమని ధనవంతులు, రాజకీయ నేతల కోసం చేసే ఈ ఖర్చును పేదలు, అనాథల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తేనే పండుగకు నిజమైన సార్థకత లభిస్తుందని క్లాస్ పీకారు. రంజాన్, ఇఫ్తార్ పండుగ గొప్పతనం గురించి.. మాధవీలత చెబితేనే ముస్లింలు తెలుసుకోవాల్సి ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
రంజాన్ సంప్రదాయాలను, ఇఫ్తార్ విశిష్టతను పాటిస్తున్న తమకు, పండుగ స్ఫూర్తి గురించి మాధవీలత క్లాసులు చెప్పడం వింతేనని వారు సైటెర్లు వేస్తున్నారు. ఇఫ్తార్ అనేది అందరూ కలిసి జరుపుకునే వేడుక అని, ఇందులో పేద, ధనిక వివక్షను వెతకడం ఆమె రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ఎంఐఎం నాయకులు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పండుగ వేళ ఇలాంటి వివాదాలు చోటుచేసుకుంటే.. పరిస్థితి ఎటు వైపు వెళ్తుందోనన్న ఆందోళన ప్రజల్లో ఉంటుంంది. కానీ మాధవీలత మాత్రం అలాంటివి పట్టించుకోరు.


