ఏపీకి భాజ‌పాకి మ‌రో కీల‌క నేత దూరం..!

Raghurama Krishnam Raju
Raghurama Krishnam Raju

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భాజ‌పాను మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని జాతీయ నాయ‌క‌త్వం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకే, ఏపీ అధ్యక్షుడి ఎంపిక‌లో కూడా ర‌క‌ర‌కాల స‌మీక‌ణ‌లూ లెక్క‌లూ వేస్తున్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ దూర‌మైంది కాబ‌ట్టి, సొంతంగా పార్టీ ఎదిగేందుకు కావాల్సిన వాతావ‌ర‌ణం నెల‌కొంద‌నే అంచ‌నాతో ఉన్నారు. ఇంత‌వ‌ర‌కూ కేంద్రం ఆంధ్రాకి చాలా చేసింద‌నీ, ఇచ్చిన హామీల‌ను 85 శాతం పూర్తి చేసిందంటూ ఈ మ‌ధ్య ఏపీ భాజ‌పా నేత‌లు ప్ర‌చారం చేసుకుంటున్నారు. అయితే, పార్టీ విస్త‌ర‌ణ‌కు ఇవ‌న్నీ పాజిటివ్ అంశాల‌నుకుంటే… దీనికి మ‌రో పార్శ్యం, భాజ‌పా నుంచి కీల‌క నేత‌ల దూర‌మౌతూ ఉండ‌టం!

ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి దూరమౌతున్న సంగతి సందిగ్ధంలో ఉంది. తాజా స‌మాచారం ఏంటంటే… న‌ర్సాపురానికి చెందిన ప్ర‌ముఖ భాజ‌పా నేత ర‌ఘురామ కృష్ణ రాజు భాజ‌పా దూర‌మ‌య్యేందుకు సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం. శుక్ర‌వారం సాయంత్ర‌మే ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో పార్టీలో చేర‌బోతున్న‌ట్టు కొన్ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. నిజానికి, గ‌త ఎన్నిక‌ల్లో భాజ‌పా త‌ర‌ఫున ఆయ‌న బాగానే ప్ర‌చారం చేశారు. న‌ర్సాపురం నుంచి భాజ‌పా ఎంపీ అభ్య‌ర్థిగా ఆయ‌నే పోటీ చేస్తార‌ని అనుకున్నారు. కానీ, చివ‌రి నిమిషంలో ఆయ‌న‌కు టిక్కెట్టు ద‌క్క‌లేదు. అయినాస‌రే, ఎలాంటి అసంతృప్తీ వ్య‌క్తం చేయ‌కుండా గ‌త ఎన్నిక‌ల్లో భాజ‌పా త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. ఆ పార్టీకే క‌ట్టుబ‌డి ఉన్నారు.

అయితే, తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌మై కేంద్రం వైఖ‌రి మార‌డం, విభ‌జ‌న హామీలూ ప్ర‌త్యేక హోదా కేంద్ర సాయం వంటి అంశాల్లో భాజ‌పా అనుస‌రిస్తున్న తీరుపై ఆయ‌న తీవ్ర అసంతృప్తిగా ఉన్నార‌ట‌. ఏపీ విష‌యంలో భాజ‌పా వైఖ‌రిలో కొంతైనా మార్పు వ‌స్తుంద‌ని ఎదురు చూశార‌నీ, కానీ రానురానూ ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం తీరు మ‌రింత అధ్వాన్నంగా మారుతూ ఉండ‌టంతో భాజ‌పాను వీడాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. తెలుగుదేశంలో చేరిన త‌రువాత‌, ఆ పార్టీ త‌ర‌ఫున వ‌చ్చే ఎన్నిక‌ల్లో నర్సాపురం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో దిగే అవ‌కాశం ఉంద‌నీ, ఈ మేర‌కు టీడీపీ నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించింద‌నీ వినిపిస్తోంది. ఆయ‌న‌తోపాటు స్థానికంగా కొంత‌మంది నేత‌లు కూడా టీడీపీలో చేరేందుకు సంసిద్ధ‌మౌతున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com