సమీక్ష…నా పేరు సూర్య

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

కల, లక్ష్యం ఏదైనా వుండొచ్చు. కానీ దానికోసం మన క్యారెక్టర్ వదులుకోకూడదు.
ఇదీ నా పేరు సూర్య సినిమాకు దర్శకుడు అనుకున్న లైన్. మంచి విషయమే.
అయితే ఎంత గొప్ప క్యారెక్టర్ అయినా ఆలంబన చేసుకుని సినిమా తీయచ్చు. కానీ స్క్రీన్ ప్లే చెడకూడదు.

సింపుల్ గా చెప్పాలంటే, మనిషికి ఎంత కోపం అయినా రావచ్చు.
కానీ అలా అని కనిపించిన ప్రతి వస్తువూ చితక్కొట్టేయకూడదు.
ఆ కోపం వ్యక్తం చేయడానికీ ఓ పద్దతి వుండాలి. అలాగే సినిమా కోసం ఎలాంటి క్యారెక్టర్ అయినా తయారుచేసుకోవచ్చు.

కానీ దానిని కూడా ఓ పద్దతిగా ప్రెజెంట్ చేయాలి.

ఇంత స్మూత్ గా, వివరంగా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఓ మంచి క్యారెక్టర్ ను రాసుకున్నారు. ఆ క్యారెక్టర్ ను చాలా చక్కగా ప్రెజెంట్ చేసారు. దానికి ఓ బాడీ లాంగ్వేజ్, ఆ పాత్రకు పదునైన సంభాషణలు రాసుకున్నారు. అంతా బాగుంది. కానీ అలాంటి పాత్రకు అనుగుణంగా సరైన కథనాన్ని మాత్రం దర్శకుడు తయారుచేసుకోలేకపోయాడు. పాత్రతో కనెక్ట్ అయ్యే ప్రేక్షకులు ఆ కథనంతో కూడా కనెక్ట్ కావాలి. రెండింటితో కనెక్ట్ అయితేనే, మొత్తం మీద రక్తి కట్టిన రసవత్తరమైన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ ను కలిగించడంలో నా పేరు సూర్య విఫలమైంది.

ఇప్పటికే నెటిజన్లు అందరికీ నా పేరు సూర్య కథ చూచాయిగా తెలుసు. సూర్య (అల్లు అర్జున్) కు కోపం ఎక్కువ. ఆ మాటకు వస్తే కోపం మాత్రమే కాదు, ఆవేశం, కోపం, ప్లస్ చిరాకు ఈ మూడూ కలిపిన ఓ కొత్త గుణం అతనిది. చిన్నప్పుడే తండ్రిని వదిలి బయటకు వచ్చేసి, ఓ గాడ్ ఫాదర్ (రావు రమేష్) సాయంతో పెరుగుతాడు. మిలట్రీలో చేరి, బోర్డర్ లో సిపాయిగా వుండాలన్నది అతని ఆశయం. కానీ అలవికాని, అంతుపట్టని అతని ఆవేశం కమ్ కోపం కారణంగా తరచు వివాదాస్పదం అవుతుంటాడు. ఆఖరికి మిలట్రీలోంచి బయటకు పంపేస్తారు. కానీ పదే పదే కోరడంతో, ప్రఖ్యాత సైకాలజిస్ట్ రామరాజు(అర్జున్) నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోమంటారు. తీరా చేస్తే ఆ సైకాలజిస్ట్ ఎవరో కాదు, సూర్య కన్నతండ్రే. అయినా వెళ్లి ప్రయత్నిస్తాడు. అప్పుడేం జరిగిందన్నది మిగిలిన కథ.

సినిమా ఎత్తుగడ చాలా పద్దతిగా వుంటుంది. తండ్రి సంతకం కోసం కొడుకు అక్కడ కు వెళ్లడం వరకు బాగానే వుంటుంది. కానీ అక్కడి నుంచే దర్శకుడు తడబడ్డాడు. హీరో ఫ్లాష్ బ్యాక్ ను కాస్త ఆకట్టుకునేలా చెప్పడంలో చాకచక్యం ప్రదర్శించలేక పోయాడు. సినిమా రెగ్యులర్ కామన్ ఆడియన్స్ కు కూడా నచ్చాలనే తాపత్రయంతో సాదా సీదా సీన్లతో డైల్యూట్ చేసాడు. కీలక మైన సన్నివేశాల్లో క్లారిటీ, ఇంటెన్సిటీ మిస్సయింది. దాంతో అవి కాస్తా ఆడ్ వన్ అవుట్ గా అనిపిస్తాయి. అన్నింటికన్నా 21 రోజుల పాటు కోపం అణచుకు వుండాలన్న నియమం పెద్ద గొప్పగా అనిపించదు. సినిమాలో హీరో క్యారెక్టర్ లో వున్న వైవిధ్యం ఇక్కడ కనిపించదు.

అబద్దాలు ఆడడం అలవాటైన వాడికి నెల రోజుల పాటు అబద్దాలు ఆడకుండా వుండమని ఏప్రియల్ ఒకటి విడుదలలో నియమం పెట్టినంత కామన్ గా వుంటుంది. అయితే మొత్తంగా చూసుకుంటే తొలిసగం ఫరవాలేదనే ఫీల్ కలిగించి, ప్రేక్షకుడిని కాస్సేపు వదిలిపెడుతుంది.

సినిమా మలిసగం ప్రారంభమయ్యాక, కాస్త చెప్పుకోదగ్గ గట్టి సీన్లే పడ్డాయి. నిజానికి సినిమాను కాస్త రక్షించినవి ఈ సన్నివేశాలే. ముఖ్యంగా సాయిుకుమార్ కుటుంబం ఎపిసోడ్ లు అన్నీ శభాష్ అనిపించుకుంటాయి. సినిమాను అలా నడిపించి, ప్రీ క్లయిమాక్స్ ఫైట్ వరకు తీసుకువచ్చి, మళ్లీ అక్కడ పాట ఇరికించడం అన్నది సినిమా ఫ్లో ను దెబ్బ తీసింది. నిజానికి ఆ పాట సరైన ప్లేస్ లో పడి వుంటే ‘ఇరగ’ దీసేది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమిటంటే, బలమైన సంభాషణలతో కూడిన ఆలోచింప చేసే సన్నివేశాలు, ఆ తరువాత బలమైన ఫైట్ సీన్లు ఈ రెండూ ఎందుకో కాస్త మిస్ మ్యాచ్ అయినట్లు అనిపిస్తుంది. ఎక్కడో కనిపించని చిన్న నాన్ సింక్ వ్వవహారం అన్నది ఏర్పడి, ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తి కలిగించదు. ఒక పక్కన బన్నీకి బరువైన సీన్ పడినప్పడు, దానికి బలమైన సంభాషణలు సెట్ అయినపుడు, బాగుంది గా..అనిపిస్తుంది. కానీ అంతలో రొటీన్ సీన్ వచ్చినపుడు, ఇదేంటో మళ్లీ…అనిపిస్తుంది. ఇలా కథనం రోలర్ కోస్టర్ మాదిరిగా కిందకి పైకి ఎక్కుతూ, దిగుతూ రావడం అన్నది స్క్రీన్ ప్లే లో సమస్య అనుకోవాలి. రంగస్థలం సినిమా స్క్రీన్ ప్లే కోసం హీరోయిజాన్ని, హీరోయిన్ ను, రొమాంటిక్, డ్యూయట్ వ్యవహారాలను నిర్మొహమాటంగా పక్కన పెట్టినట్లు, ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ తో సినిమాను ఉన్నతంగా తీర్చి దిద్దడం కోసం మిగిలినవి త్యాగం చేయలేకపోయారు. అలా అని అలా చేసినవి ఏమైనా రక్తి కట్టాయా? అంటే అదీ లేదు. పతాక సన్నివేశంలో సంభాషణలు బాగున్నాయి కానీ, అక్కడ కూడా హీరో క్యారెక్టర్ గురించి ఆలోచించి, విలన్ ను వదిలేసారు. ఆ మాటకు వస్తే సినిమాలో బలమైన విలనిజం కనిపించదు.

ఇలాంటి సినిమా మొత్తం మీద జనాలను కాస్త ఆలోచించి, బాగుందా? బాగోలేదా? ఏవరేజ్ నా? అని ఊగిసలాడే చేసింది ఏమిటీ అంటే హీరో క్యారెక్టర్ మాత్రమే. అసలు బన్నీ ఈ సినిమాను ఓకె చేయడానికి వక్కంతం వంశీ లాంటి కొత్త దర్శకుడి చేతిలో వంద కోట్ల సినిమా పెట్టడానికి అదే కారణం అయి వుంటుంది. ఆ విషయంలో మాత్రం వక్కంతం హీరో ఆశలు వమ్ము చేయలేదు. ఆ క్యారెక్టర్ ను ఆరంభం నుంచి చివరి వరకు బాగా తీర్చిదిద్దాడు. దానికి మాంచి సంభాషణలు అందించాడు. బన్నీ దానికి తగినట్లు తనకు తాను మౌల్డ్ అయి మంచి నటన అందించాడు. ఆ క్యారెక్టర్ నడక కోసం రాసుకున్న సీన్లంటి మీద బాగానే హోమ్ వర్క్ చేసినట్లు కనిపిస్తుంది.

కానీ ఆ క్యారెక్టర్ ను బ్యాలెన్స్ చేస్తూ, సినిమాలో మరే ఒక్క క్యారెక్టర్ కూడా తయారుచేయలేకపోయారు. సీనియర్ అర్జున్ క్యారెక్టర్ కూడా బిల్డప్ ఎక్కువ, అసలు తక్కువ అన్నట్లు వుంటుంది. విలన్ గా శరత్ కుమార్, అనూప్ ఠాకూర్ కూడా అంతే. హీరోయిన్ అను, అగర్వాల్ సినిమాకు మైనస్ అయింది తప్ప ప్లస్ కాలేకపోయారు. మరెవరైనా వుంటే కాస్త బెటర్ అయ్యేదేమో?

సినిమాకు పాటలు కొంత వరకు మైనస్. మొదటి పాట ఒక్కటే అన్ని విధాలా బాగుంటుంది. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. నిర్మాణ విలువలు, లొకేషన్లు ఒకె. సినిమాటోగ్రఫీ కూడా అంతే. మరీ అద్భుతాలు లేవు. అలా అని నాసిగానూ లేదు. టోటల్ గా వక్కంతం వంశీ సంభాషణల రచయితగా హిట్. బన్నీ నటుడిగా సూపర్. కానీ బన్నీ కోసం ఓ అద్భుతమైన క్యారెక్టర్ తయారుచేసి, దాని కోసం అల్లిన కథనం మాత్రం కంగాళీ అనే చెప్పాలి. అక్కడే వక్కంతం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

ఫినిషింగ్ టచ్ : క్యారెక్టర్ ఓకె. కథనమే కంగాళీ

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైకోర్టు తీర్పుకే వక్రభాష్యం..! ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా..?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా.. అన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. దొడ్డిదారి ప్రయత్నాలు చేశారు... కానీ...

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

HOT NEWS

[X] Close
[X] Close