లక్ష్మినారాయణ ఆంధ్రా కేజ్రీవాల్..! ప్లాన్ ఇదేనా..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం లేదు. అలా అని రాను అని కూడా చెప్పడం లేదు. కానీ పరోక్షంగా రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని మాత్రం విశదీకరిస్తున్నారు. జిల్లాల పర్యటనలు ప్రారంభించిన లక్ష్మినారాయణ ఎక్కడికెళ్లినా… రాజకీయ సంబంధ అంశాలపైనే మీడియా ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. కానీ ఎక్కడా ఆయన తడబడటం లేదు. తాను చెప్పాలనుకున్నది చెబుతున్నారు. ప్రస్తుతానికి తాను అధ్యయనంలో ఉన్నానని తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. దానికి రెండు నెలల సమయం పట్టవచ్చని చెబుతున్నారు.

అయితే లక్ష్మినారాయణ రాజకీయ పయనంపై..స్పష్టమైన విజన్‌తోనే ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్ఫూర్తిగా ఆయన రాజకీయం చేస్తున్నారని.. విశ్లేషిస్తున్నారు. కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారి. పదవికి రాజీనామా చేసి మొదటగా సామాజిక సేవా కార్యక్రమాల్లోకి దిగారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ ఉద్యమంలో వచ్చిన పేరుతో.. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు. కొన్ని ఒడుదుడుకులు ఎదురైనా..రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఇదే పంథాలో లక్ష్మినారాయణ కూడా పయనిస్తున్నారు. అయితే కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేకత ఉద్యమాన్ని నిర్వహిస్తే.. లక్ష్మినారాయణ మరింత పరిణతి చెందిన రాజకీయంతో రైతు సమస్యలను భుజానకెత్తుకున్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా వచ్చేలా సీట్లు వచ్చాయంటే.. అవినీతి అంశం కన్నా.. ఇతర అంశాలే ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని అంచనాకు వచ్చి ఉంటారు. వాటిలో రైతు సమస్యల ఎజెండా అయితే బాగుంటుందని డిసైడయినట్లు తెలుస్తోంది.

రెండు నెలల అధ్యయనం తర్వాత లక్ష్మినారాయణ రైతు సమస్యల పరిష్కారం కోసం.. కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేసే అవకాశం ఉంది. వాటిని మ్యానిఫెస్టోలో పెట్టాలనో.. లేకపోతే.. తక్షణం వాటిని పరిష్కరించాలనో డిమాండ్ చేస్తారు. అచ్చంగా అవినీతి అంశంపై లోక్‌పాల్ బిల్లు కోసం. ఎలా అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ ఉద్యమించారో.. అలాగే..లక్ష్మినారాయణ ఉద్యమించే చాన్స్ ఉంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే..ఓ తరహా.. స్పందించకపోతే..మరో తరహా రాజకీయంతో లక్ష్మినారాయణ .. రాజకీయాల్లో ఏపీ కేజ్రీవాల్ అయ్యేందుకు ప్రయత్నించే చాన్స్ ఉంది. మొత్తానికే ఏపీ కేజ్రీవాల్.. లక్ష్మినారాయణ అయ్యే చాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com