తెదేపాతో పొత్తుల వల్ల బీజేపీ నష్టపోతోందా?

నిజామాబాద్ తెరాస ఎంపీ కవిత ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్య చేసారు. తెలంగాణాలో తెదేపాతో స్నేహం చేయడం వలన బీజేపీ ప్రజలకు దూరం అవుతోందని అన్నారు. ఆమె కనిపెట్టిన ఈ కొత్త సిద్దాంతాన్ని పూర్తిగా కొట్టి పారేయలేము. ఎందుకంటే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత ఏడాది కాలంగా జరుగుతున్న యుద్దాలు, తలెత్తుతున్న సమస్యల పట్ల రాష్ట్ర బీజేపీ నేతలు ఏనాడూ గట్టిగా స్పందించిన దాఖలాలు లేవు. అదే బీజేపీకి తెదేపాతో పొత్తులు లేకపోయుంటే బీజేపీ నేతలు కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేవారు. కానీ తెదేపాతో పొత్తు కారణంగా వారు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఆ కారణంగానే వారు అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను మనసులోనే దాచుకోవలసిన దుస్థితి ఏర్పడింది.

ఉదాహరణకి సెక్షన్: 8 అమలు గురించి ఆంద్రప్రదేశ్ మంత్రులు, తెదేపా నేతలు గవర్నర్, కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చేప్రయత్నం చేస్తున్నప్పుడు తెదేపాతో ఉన్న పొత్తు కారణంగా తెలంగాణా బీజేపీ నేతలు వారిని గట్టిగా వ్యతిరేకించలేకపోయారు. వారు కూడా తెలంగాణా తెదేపా నేతల్లాగే గట్టిగా మాట్లాడలేక పోవడం వలన, ఆ అవకాశాన్ని కాంగ్రెస్, తెరాస పార్టీలు అందిపుచ్చుకొని గట్టిగా మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకోగలుతున్నాయి. అలాగే ఓటుకి నోటు కేసులో కూడా తెలంగాణా బీజేపీ నేతలు మౌనం వహించాల్సి వచ్చింది. ఆంధ్రా, తెలంగాణాకు సంబంధించి పలు అంశాలు, వివాదాలలో వారు తమ వైఖరిని చెప్పలేక చాలా ఇబ్బందిపడుతున్నారు. దాని వలన తెలంగాణాలో బీజేపీకే ఎక్కువగా నష్టం జరుగుతోందని అంగీకరించక తప్పదు.

కానీ, నేటికీ తెలంగాణాలో బీజేపీ కంటే తెదేపాయే బలంగా ఉందనే విషయం విస్మరించలేము. సాధారణ ఎన్నికలలో వచ్చిన ఫలితాలే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. బీజేపీ కేవలం హైదరాబాద్ లోనే బలంగా ఉంటే తెదేపా రాష్ట్రంలో చాలా జిల్లాలలో బలంగా ఉంది. కనుక తెలంగాణాలో తెదేపాతో బీజేపీ పొత్తులు కొనసాగించకతప్పదు. ఒకవేళ తెదేపాకి కటీఫ్ చెప్పేసినా తెరాసకు తోకపార్టీగానే ఉండక తప్పదు. ఒకవేళ తెలంగాణాలో తెదేపాకి కటీఫ్ చెప్పేస్తే, అవతల ఆంధ్రలో కూడా కటీఫ్ చెప్పవలసివస్తుంది. అప్పుడు ఇంకా చాలా కూడికలు, తీసివేతల లెక్కలు కట్టుకోవలసి ఉంటుంది. కనుక ఇప్పట్లో తెదేపా, బీజేపీలు కటీఫ్ చెప్పుకొనే అవకాశం లేదు. కనుక తెరాస ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం కూడా లేదు.అది వీలులేకపోతే కవితమ్మకి కేంద్రమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండదు పాపం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com