తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు నడుస్తున్నాయి. తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, విజయ్ పార్టీని తమ కూటమిలోకి లాగడం ద్వారా ద్వంద్వ ప్రయోజనాలను ఆశించింది. ఒకవైపు విజయ్ క్రేజ్‌ను వాడుకోవడం, మరోవైపు ఆయన ఒంటరిగా పోటీ చేస్తే చీలే ఓట్లు తమకు నష్టం కలిగిస్తాయనే భయం బీజేపీలో ఉంది. అందుకే, టీవీకే ఎన్డీఏలో చేరుతుందనే ప్రచారాన్ని కావాలనే తెరపైకి తెచ్చి విజయ్‌పై ఒత్తిడి పెంచే మైండ్ గేమ్ ఆడుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని విజయ్ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. పొత్తుల విషయంలో బయట జరుగుతున్న ప్రచారానికి, విజయ్ ఆలోచనలకు అసలు పొంతన లేదని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒంటరి పోరుకే మొగ్గు.. అభ్యర్థుల ఖరారు
వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో, విజయ్ ఇప్పుడు కొత్తగా పొత్తుల కోసం చర్చలు జరిపే ప్రసక్తే లేదని భావిస్తున్నారు. వాస్తవానికి, టీవీకే ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. రాజకీయాల్లోకి వస్తూనే ఇతర పార్టీల అండ కోరడం వల్ల తన సొంత అస్తిత్వం దెబ్బతింటుందని విజయ్ బలంగా నమ్ముతున్నారు. అందుకే, ఎవరితోనూ చేతులు కలపకుండా ఒంటరి పోరు సిద్ధాంతంతోనే ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నారు.
సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సరికొత్త తరం
విజయ్ తన పార్టీ నిర్మాణంలో పాత తరం రాజకీయ నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అవినీతి మచ్చ లేని యువత, విద్యావంతులు , సామాజిక స్పృహ ఉన్న కొత్త ముఖాలతో ఆయన రంగంలోకి దిగుతున్నారు. సంప్రదాయ రాజకీయ పద్ధతులకు స్వస్తి పలికి, డిజిటల్ యుగపు రాజకీయాలను ఆయన నమ్ముకున్నారు. కూటములు, బేరసారాలు వంటి పాత తరం ఎత్తుగడల కంటే, ప్రజల వద్దకు నేరుగా తన సిద్ధాంతాలను తీసుకెళ్లడమే మేలని ఆయన భావిస్తున్నారు. విజయ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి ఎవరికి లాభం జరుగుతుందన్న చర్చ సాగుతోంది. అయితే విజయ్ లక్ష్యం కేవలం ఓట్లు చీల్చడం కాదు, అధికార పీఠమే అని ఆయన వర్గాలు చెబుతున్నాయి. అధికార డీఎంకే , ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఏదైనా కూటమిలో చేరితే ఆయా పార్టీల వ్యతిరేకతను కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది. అదే ఒంటరిగా పోటీ చేస్తే, తటస్థ ఓటర్లను , మార్పు కోరుకునే యువతను తన వైపు తిప్పుకోవచ్చని విజయ్ మాస్టర్ ప్లాన్ వేశారు.
తగ్గేదే లే.. విజయ్ రాజకీయ తెగింపు
సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావడం ఒక సాహసమైతే, తొలి ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేయడం అంతకంటే పెద్ద సాహసం. విపక్షాలు తనపై ఎంతటి ఒత్తిడి తెచ్చినా, తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేందుకే విజయ్ మొగ్గు చూపుతున్నారు. మైండ్ గేమ్స్, సోషల్ మీడియా ప్రచారాలు తన సంకల్పాన్ని మార్చలేవని ఆయన చేతల్లో చూపిస్తున్నారు. తమిళనాడు ప్రజలు మార్పును ఆశిస్తున్నారని, ఆ మార్పుకు తానే వేదిక కావాలని ఆయన బలంగా ఆశిస్తున్నారు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూ, ఎన్నికల ఫలితాలతోనే విమర్శకులకు సమాధానం చెప్పాలన్నది విజయ్ వ్యూహం.


