భారత మహిళ శక్తికి నిదర్శనంగా కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లను ఇప్పటి వరకూ చెప్పుకున్నారు. కానీ కొంత మంది బీజేపీ నేతలకు ఆమె ముస్లిం. అంతే కాదు ఆమెను ముస్లింల ప్రతీకారం కోసం వారి జాతి మహిళలనే పంపిందట. హిందువుల బట్టలు విప్పదీసిన వారికి బుద్ది చెప్పడానికి వారి జాతి మహిళనే పంపిందట. ఇలాంటి ఆలోచనలు ఎందుకు ఎలా వస్తాయో కానీ బీజేపీ నేతలకే వస్తాయి. రావడమే కాదు..దాన్ని ప్రజల ముందు బహిరంగంగా చెప్పుకుంటారు. నవ్వుల పాలవుతారు.
మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో కున్వర్ విజయ్ షా అనే మంత్రి ఉన్నారు. ఆయన నోటి వెంట కల్నర్ సోఫియా ఖురేషి గురించి దారుణమైన వ్యాఖ్యలు వచ్చాయి. మన ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపేసిన వారి అంతు చూడాలని, వారి వర్గానికి చెందిన సోదరిని మోడీ పంపారని వ్యాఖ్యానించారు. మన హిందువుల బట్టలు విప్పిన వారి జాతి బిడ్డను ప్రతీకారం తీర్చుకోవడానికి పంపించామని చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంత సిక్ మైండ్ రాజకీయ నేతలు ఎలా మంత్రులు అవుతారన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
మరో వైపు ఈ మాటలపై దుమారం రేగింది. తాను తప్పు మాట్లాడానని తెలుసుకున్న మంత్రి..క్షమాపణ చెప్పలేదు. కానీ తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని సగటు రాజకీయ నేతలాగే కౌంటర్ ఇచ్చాడు. కానీ కోర్టు అంగీకరించలేదు. ఆయనపై కేసులు పెట్టాలని ఆదేశించింది. కేసులు నమోదవుతాయి కానీ.. ఆయనను ఏమీ చేయలేరు. ఇలాంటి రాజకీయ నేతల వల్ల దేశానికి సేవ చేసే వారికి కూడా కులాలు, మతాలు అంటగట్టేవారు బయటపడుతూంటారు.