ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఇతర మంత్రులు అయినా అరెస్టు అయిన 30 రోజుల తర్వాత అంటే 31వ రోజున ఆటోమేటిక్ గా పదవి పోతుంది. అరెస్టు అయిన కేసు ఐదేళ్లు శిక్షపడే సెక్షన్ల కింద నమోదు అయితే చాలు. ఈ మేరకు చట్టాన్ని పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెడుతోంది. ఇదేదో ప్రధానమంత్రిని కూడా చట్టపరిధిలోకి తెస్తున్న గొప్ప చట్టం అనుకుంటారు కానీ.. తమకు నచ్చని ప్రభుత్వాలు ఉన్న చోట్ల కుట్రలు చేయడానికి ఉపయోగపడే చట్టం అని .. ఇప్పటి వరకూ జరిగిన రాజకీయ పరిణామాలను అర్థం చేసుకున్న వారికి తెలిసి వస్తుంది.
కేంద్రం మంత్రులపై కేసులు పెట్టే ధైర్యం పోలీసులకు ఉంటుందా ?
కేంద్ర మంత్రులపై కేసులు పెట్టేంత బలమైన దర్యాప్తు సంస్థలు, పోలీసు వ్యవస్థ మనకు లేదు. పాలకుల కనుసన్నల్లోనే నడిచిపోయే వ్యవస్థలే ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు అత్యంత పవర్ ఫుల్. అలాగే ఢిల్లీలో శాంతిభద్రతలు కూడా కేంద్రం దగ్గరే ఉంటాయి. ఈ సంస్థలు ఏవీ కేంద్ర మంత్రివర్గంలోని వారిపై ఈగ వాలనివ్వవు. ఎంత నేరం చేసినా పట్టించుకోరు. కానీ.. మంత్రిగా ఉండి.. కేంద్రంలోని పెద్దల్ని ధిక్కరిస్తే మాత్రం వెంటనే అరెస్టులు జరిగిపోతాయి. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పని చేసిన సత్యపాల్ మాలిక్ ఉదంతమే దానికి ఉదాహరణ. ఆయన బీజేపీ పెద్దలతో విబేధించిన తర్వాత ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన ఇప్పుడు చనిపోయారు.
ఇష్టం లేని ప్రభుత్వాధినేతలపై గురి పెట్టడానికే !
బీజేపీ పాలనలో ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రుల్ని అరెస్టు అయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది. అయితే ఆయన రాజీనామా చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ పదవి చేపట్టారు. కానీ కేజ్రీవాల్ అలా చేయలేదు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన తర్వాత ఆయన జైలులో కూడా సీఎంగానే ఉన్నారు. ఆయన రాజీనామా చేయాలన్న నిబంధనలు లేవు. అలాగే మంత్రులు కూడా. అందుకే ఏమీ చేయలేకపోయారు. ఇలా మరోసారి జరగకూడదని.. దర్యాప్తు సంస్థలతో సీఎంలను అరెస్టు చేయిస్తే వారు రాజీనామా చేయాల్సిందేనని లేకపోతే 31వ రోజుకు పదవిపోయేలా చట్టం తెస్తున్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ఆ ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటాయి. వాళ్ల పరిధి ఆ రాష్ట్రం వరకే. అందుకే కేంద్ర పెద్దలపై చర్యలు తీసుకోలేరు. ముఖ్యమంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టి అరెస్టు చేయగలవు.
దుర్వినియోగం కోసమే పట్టాలా ?
బీజేపీ కేవలం దుర్వినియోగం చేయడానికే ఇలాంటి చట్టాలు చేస్తోందన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం.. కేవలం స్పీకర్ కు కాలపరిమితి లేకపోవడం వల్లనే నిర్వీర్యం అవుతోంది. అధికార పార్టీల చేతిలో వంచనకు గురవుతుంది. ఈ చట్టం మార్చాలని.. స్పీకర్ కు అయినా ఓ టైమ్ ఫ్రేమ్ పెట్టాలని స్వయంగా సుప్రీంకోర్టు సూచించినా పట్టించుకోవడంలేదు కానీ ఇలాంటి అర్థం, పర్థం లేని చట్టాలను తీసుకు రావడానికి మాత్రం వెనుకాడటం లేదు. బిల్లు పెట్టిన వెంటనే పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతారు. చట్టంగా మార్చే ముందు విస్తృత చర్చ జరిగేలా విపక్షాలే చూసుకోవాల్సి ఉంది.