ఢిల్లీ పెద్దలపై చాలా గౌరవం ఉందని పవన్ కల్యాణ్ చెబుతూ ఉంటారు. ఆ గౌరవాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని బీజేపీ అగ్రనేతలు ఆయనతో పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారన్న అనుమానాలు జనసైనికుల్లో వస్తున్నాయి. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా అరగంట పాటు పవన్, నాదెండ్లతో సమావేశం అయ్యారు. కానీ ఏపీ రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడలేదు. వచ్చే ఎన్నికల్లో ఏ వ్యూహంతో వెళ్లాలన్నది కూడా ఖరారు చేయలేదని చెబుతున్నారు. కర్ణాటకలో ప్రచారం గురించి మాత్రం కొంత సేపు మాట్లాడారని.. ఇతర విషయాలపై తర్వాత మాట్లాడదామన్నట్లుగా స్పందించారని జనసేన వర్గాలు చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్తో రెండు సార్లు భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో అరగంట పాటు చర్చలు జరిపారు. అధికారం సాధించే దిశగానే చర్చలు జరిపామని ప్రకటించారు. వ్యతిరేక ఓటు చీలకూడదనేదే మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్ మాటల్లో ఎప్పటి లాంటి అస్పష్టతే స్పష్టంగా కనిపించింది. ఓట్లు చీలకూడదనుకుంటే టీడీపీతో వెళ్లాల్సి ఉంటుంది. కానీ బీజేపీ, జనసేన లక్ష్యం వైసీపీని ఓడించడమేనని పవన్ చెబుతున్నారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలడం ఖాయమని రాజకీయవర్గాలు చెబుతున్నారు. మరి పవన్ ఏమనుకుంటున్నారన్నది స్పష్టత లేకుండా పోయింది.
ఏపీలో బీజేపీ-జనసేన మధ్య అధికారికంగా పొత్తున్నప్పటికీ ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడంలేదు. ఇప్పటికీ బీజేపీ, జనసేన పొత్తులోనే ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం కలిసి పని చేయడం లేదు. రాష్ట్ర నాయకులతో తనకు గ్యాప్ ఉందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. వారు వైసీపీపై పోరాటం చేయడం లేదని పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నేతలు కూడా అడిగినప్పుడు కూడా జనసేన మద్దతు ప్రకటించలేదని.. పొత్తు ఉన్నా లేనట్లేనని ప్రకటించేశారు.
రాజకీయాల్లో మొహమాటాలకు చాన్స్ ఉండదు. రాజకయంగా తమ పార్టీకి ఏది ప్రయోజనం అయితే అదే చేస్తారు ఏ రాజకీయ నేత అయినా. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని చెబుతూంటారు. అలాగే రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కూడా అంతే. కానీ పవన్ బీజేపీతో పయనం విషయంలో మొహమాటానికి పోతున్నారు. దీన్ని బీజేపీ హైకమాండ్ అడ్వాంటేజ్‌గా తీసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.