తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ప్రారంభంలో బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించిన విజయ్, గత కొద్ది రోజులుగా ఆ పార్టీపై విమర్శల పదును తగ్గించారనే చర్చ తమిళ రాజకీయాల్లో సాగుతోంది.
సైద్ధాంతిక శత్రువుపై విమర్శలు తగ్గించిన విజయ్
విజయ్ తన పార్టీ తొలి బహిరంగ సభలో డీఎంకేను రాజకీయ శత్రువుగా, బీజేపీని సైద్ధాంతిక శత్రువగా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే, ఇటీవల ఓటర్ల జాబితా సవరణ, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ వంటి అంశాలపై ఆయన కేంద్రాన్ని నేరుగా విమర్శించకుండా, రాష్ట్ర ప్రభుత్వంపైనే ఎక్కువ విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంపై ఘాటు విమర్శలు చేస్తే రాష్ట్రంలో డీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారని.. అందుకే ఆయన తన పూర్తి ఫోకస్‌ను అధికార డీఎంకేపైనే పెట్టారని అంటున్నారు.
పొత్తుల కోసం తలుపులు తెరిచే ఉంచారా?
2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను ఢీకొట్టాలంటే ఒంటరి పోరాటం కష్టమని విజయ్‌కు తెలుసు. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ కూడా బలమైన స్థానం కోసం ప్రయత్నిస్తోంది. ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయినా, అన్నాడీఎంకే తో కలిసి మూడో కూటమిని ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీని అనవసరంగా కెలికితే, రేపు రాజకీయ సమీకరణాలు మారినప్పుడు ఇబ్బంది అవుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కరూర్ తొక్కిసలాట ఘటన విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తు ఒత్తిడి తో కూడా విజయ్ సాఫ్ట్ కార్నర్ అనుసరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.
ఓన్లీ డీఎంకే మాత్రమే టార్గెట్
బీజేపీపై విమర్శలు చేయకపోవడానికి విజయ్ ఫ్యాన్స్ కొత్త అర్థాలు చెబుతున్నారు. రాష్ట్రంలో డీఎంకే వ్యతిరేక ఓటు బ్యాంకును పూర్తిగా తన వైపు తిప్పుకోవడమే విజయ్ అసలు లక్ష్యమని, బీజేపీపై విమర్శలు చేయడం వల్ల డీఎంకేకు ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు మరింత బలపడే అవకాశం ఉందని, అందుకే ఆయన మౌనం వహిస్తున్నారని వారు చెబుతున్నారు. విజయ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ గమనిస్తే, ఆయన ఎక్కువగా ప్రజా సమస్యలు, నిరుద్యోగం , అవినీతిపైనే స్పందిస్తున్నారు. సిద్ధాంతాల కంటే కూడా పాలనాపరమైన అంశాలతో యువతను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. బీజేపీపై విమర్శలు తగ్గించడం ద్వారా హిందుత్వ ఓటు బ్యాంకులో కూడా కొంత చీలిక తీసుకురావచ్చనేది ఆయన అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి విజయ్ ‘మౌనం’ వెనుక 2026 ఎన్నికలకు సంబంధించిన ఒక పక్కా ప్లాన్ ఉందని తమిళ మీడియా చెబుతోంది. అవి పొత్తులా.. ఓట్ల చీలికలా అన్నది ముందు ముందు క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది .


