తెరాస‌లో స‌గం స‌భ్య‌త్వాల సంఖ్య సాధ‌నే భాజ‌పా ల‌క్ష్యం..!

తెలంగాణ‌లో నంబ‌ర్ 2 స్థానం కోసం భాజ‌పా క‌స‌ర‌త్తు ప్రారంభిస్తోంది. తెరాస త‌రువాత కాంగ్రెస్ ఉన్నా… లేని ప‌రిస్థితి ఉంది. అందుకే, ఈ స్థానానికి ఎగ‌బాకాల‌న్న‌ది భాజ‌పా వ్యూహం. దాన్లో భాగంగా పెద్ద ఎత్తున స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ‌లో అమిత్ షా ప్రారంభించ‌బోతున్నారు. మిగ‌తా రాష్ట్రాల‌న్నింటిలోనూ గ‌తం కంటే ఓ ప‌ది నుంచి ఇర‌వై శాతం అధికంగా స‌భ్య‌త్వాలు న‌మోదు కావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, తెలంగాణ‌లో గ‌తం కంటే క‌నీసం రెండింత‌ల సంఖ్య‌లో స‌భ్య‌త్వాలు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర నేత‌ల‌కు జాతీయ నాయ‌క‌త్వం ల‌క్ష్యంగా పెట్టింది.

తెలంగాణ‌లో ప్రస్తుతం త‌మ‌కు 18 ల‌క్ష‌ల‌మంది స‌భ్య‌త్వం ఉంద‌ని చెప్పారు భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్. ఈ నెల‌లో ప్రారంభం కానున్న స‌భ్య‌త్వ నమోదు కార్య‌క్ర‌మం ద్వారా పెద్ద సంఖ్య‌లో స‌భ్యుల‌ను చేర్చాల‌నీ, క‌నీసం 40 శాతం కొత్తవారు న‌మోద‌య్యేందుకు కృషి చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో తెరాస‌ను గ‌ద్దెదించి అధికారంలోకి రావ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అన్నారు. పెద్ద సంఖ్య‌లో నాయ‌కులు త్వ‌ర‌లో పార్టీలో చేరుతార‌న్నారు. రాహుల్ గాంధీ గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచిద‌ని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానురానూ నీర‌సించిపోయింద‌ని ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్యానించారు.

2023 ల‌క్ష్యంగా భాజ‌పా ఇప్ప‌ట్నుంచీ తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు పావులు క‌దుపుతోంది. ఇదే ల‌క్ష్యంతో తెరాస కూడా తీవ్ర‌మైన కృషే చేస్తోంది. తెరాస‌కి కోటిమంది స‌భ్య‌త్వాలు ఉండాల‌నే ల‌క్ష్యాన్ని సీఎం కేసీఆర్ పెట్టుకున్నారు. అంటే, తెలంగాణ మొత్తం జ‌నాభాలో క‌నీసం 25 శాతం మంది తెరాస‌లో ఉండాలి! ఈ ల‌క్ష్య సాధ‌న ద్వారా పార్టీకి బ‌ల‌మైన పునాదులు వేసుకోవ‌డం ముఖ్య‌మంత్రి ల‌క్ష్యం. దీన్లో స‌గ‌మైనా, అంటే 50 ల‌క్ష‌ల స‌భ్య‌త్వాన్ని సాధించాల‌నేది భాజ‌పా ల‌క్ష్యం. ప్ర‌స్తుతం ఉన్న 18 ల‌క్ష‌లున్న‌ సంఖ్య‌ను దాదాపు రెండింత‌లు కంటే ఎక్కువగా పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది అనుకున్న ఈజీ కాదు. అందుకే, కొత్త‌గా చేరే నాయ‌కుల‌కు కూడా ఫ‌లానా ఇంత‌మందిని స‌భ్యులుగా చేర్చాల‌నే ల‌క్ష్యాన్ని కూడా భాజ‌పా నిర్దేశిస్తున్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ‌లో తెరాస త‌రువాత తామే నంబ‌ర్ టు అని చెప్పుకోవాలంటే… తెరాస‌లో స‌గ‌మైనా స‌భ్య‌త్వాలు ఉండాలి క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com