జగన్‌పైన ప్రేమ కాదు….బాబుపైన ద్వేషం మాత్రమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పతనం దిశగా నడిపించే దిగజారుడు నిర్ణయాన్ని చంద్రబాబులాంటి అత్యంత అనుభవజ్ఙుడైన నాయకుడు తీసుకున్నాడు. వైకాపా జంపర్స్‌కి మంత్రి పదవులు ఇచ్చాడు. తెలంగాణాలో దేన్నైతే వ్యభిచారంతో పోల్చాడో అదే పనిని తాను కూడా చేశాడు చంద్రబాబు. చంద్రబాబు నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అదే టైంలో బిజెపి వాళ్ళు మాత్రం రాజకీయం స్టార్ట్ చేశారు. తుమ్మితే ఊడిపోయేలా ఉన్న టిడిపి-బిజెపి బంధం 2019 ఎన్నికల నాటికి కచ్చితంగా తెగిపోతుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా విడిపోవాల్సి వస్తే ప్రజలకు ఏం చెప్పాలి అనే విషయంలో చంద్రబాబుకు పూర్తి క్లారిటీ ఉంది. బిజెపి మైనారిటీలకు ద్రోహం చేస్తోంది అని 2004 తర్వాత నుంచీ 2014 ముందు వరకూ తాను వినిపించిన రికార్డును మరోసారి వినిపించగలడు. ఇక రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు, పోల‘వరం’ ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వేజోన్ కూడా ఇవ్వలేదు….విభజన టైంలో కాంగ్రెస్ చేసిన ద్రోహం కంటే 2014 నుంచీ 2019 వరకూ బిజెపి చేసిన ద్రోహమే ఎక్కువ అని చెప్పగలడు. బహ్మాండమైన భజన మీడియా ఎలాగూ ఉంది కాబట్టి ప్రజలను నమ్మించడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. డెబ్భై వేల కోట్ల రుణమాఫీలను చంద్రబాబు మాత్రమే చెయ్యగలడు అని నమ్మించినవాళ్ళకు ఇదో పెద్ద లెక్కా. ఇక ఉత్తరభారతదేశం-దక్షిణ భారతదేశంల మధ్య బిజెపి తేడా చూపిస్తోందని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు సపోర్ట్‌గా ఓ పాట అందుకోగలడు.

విడిపోతే ఏంటి అనే విషయంలో చంద్రబాబు వైపు నుంచి అన్నీ పక్కాగా ఉన్నాయి. మరి బిజెపి అస్త్రాలు ఏంటి? విడిపోయిన తర్వాత బురదజల్లడానికి వాళ్ళకూ కొన్ని పాయింట్స్ కావాలి కదా. ఇప్పుడు బిజెపి చేస్తున్నది కూడా ఆ ప్రయత్నమే. పార్టీలను చీల్చి…పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను చేర్చుకుని…వాళ్ళకు మంత్రి పదవులను కట్టబెట్టిన బిజెపికి చంద్రబాబు చర్యలు ఘోరమైన తప్పులుగా కనిపించడం వెనకాల ఉన్న అసలు కారణం ఇదే. ఈ సందర్భంగా బిజెపి నాయకుల మాటలు కూడా పిచ్చ కామెడీగా ఉంటున్నాయి. పార్టీ అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం అంటూ రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. అసెంబ్లీలో ట్రూ కమెడియన్‌లా మాట్లాడుతున్న విష్ణుకుమార్‌రాజు అయితే ఓ సూపర్ కామెడీ డైలాగ్ పేల్చాడు. ‘నేనే కనుక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఫిరాయించిన వాళ్ళ చేత రాజీనామా చేయించి…వాళ్ళను ఎన్నికల్లో గెలిపించుకుని…అప్పుడు మంత్రులను చేసేవాడిని’ అని బాహుబలిలో ప్రభాస్ రేంజ్ డైలాగ్ కొట్టాడు. అసెంబ్లీలో అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేని ఈయనగారి ఉత్తరకుమార ప్రగల్భాలు జబర్ధస్త్ జోకుల కంటే బాగా పేలుతున్నాయి. ఇక రాష్ట్ర విభజన సమయం ముందు వరకూ రాజకీయాల్లో హీరో అనిపించుకున్న పురంధేశ్వరి….ఆ తర్వాత నుంచీ డౌన్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా పురంధేశ్వరిని బిజెపి ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తుందే తప్ప ఆ పార్టీలో పురంధేశ్వరి అస్థిత్వం ఏంటో ఆమెకు కూడా స్పష్టత ఉన్నట్టుగా లేదు. ఇలాంటి డమ్మీ నాయకులతో ఇప్పుడు మాట్లాడించడానికి కూడా కారణం ఒక్కటే. రేపు ఎన్నికల సమయంలో ఇదే మాటలను సీరియస్‌గా వాడుకోవాలన్న ప్రయత్నం. ఈ బిజెపి నాయకుల మాటలు జగన్ పార్టీ జనాలకు మాత్రం సంతోషం కలిగిస్తున్నట్టున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ గెలుపు పుణ్యమా అని వచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది బిజెపి. అంతే కానీ పొత్తు రాజకీయాల కోసమో, తోక పార్టీగా ఉండడానికో కాదు అన్న మాట వాస్తవం. రెండేళ్ళ క్రితం కనిపించిన హడావిడి ఇప్పుడు బిజెపిలో మరోసారి కనిపిస్తుంది. ఈ సారి అయినా ఇదే ఊపు కంటిన్యూ చేస్తారేమో చూడాలి. అయినా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన ద్రోహంలో సమాన భాగమున్న బిజెపిని, 2014లో ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌లతో కలిసి మోసపు మాటలతో నమ్మించి ఓట్లు కొల్లగొట్టి….ఆ తర్వాత నూటికి నూరు శాతం మోసం చేసిన బిజెపిని 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆదరిస్తారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]