రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల నియామకాల్ని దాదాపుగా పూర్తి చేసిన బీజేపి పెద్దలు ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించారు. పార్టీలో అధ్యక్షుడిగా ఎవరున్నా.. పెత్తనం చేసేది మోదీ, షాలు మాత్రమే. వారి మాటే చెల్లుబాటు అవుతుంది. అధ్యక్షుల్ని కూడా వారే ఖరారు చేయాల్సి ఉంది. అనేక రకాల సమీకరణాలతో అధ్యక్షుడ్ని ఎంపిక చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవి కాలం ముగిసింది. కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయడమే మిగిలింది.
ప్రధాని మోదీ, అమిత్ షా ఈ సారి మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. త్వరలో జనగణన జరగనుంది.. ఆ తర్వాత మహిళా బిల్లు అమల్లోకి వస్తుంది. ఇలాంటి సమయంలో మహిళను అధ్యక్షురాలిగా నియమిస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్లస్ అవుతుందన్న అభిప్రాయానికి వస్తున్నారు. అది కూడా దక్షిణాది ప్రాంత నేతలకు అవకాశం కల్పించాలన్న యోచనతో కసరత్తు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
దక్షిణాది నుంచి బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడగలిగే స్థాయి ఉన్న మహిళా నేతలు కొద్ది మందే ఉన్నారు. ఏపీకి పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వానతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రధానమంత్రి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ హైకమాండ్ ఎప్పుడూ చిన్న హింట్ కూడా ఇవ్వదు. ప్రచారంలోకి వచ్చిన పేర్లు చాలా తక్కువ సార్లే పదవులకు ఎంపికయ్యాయి. ఇప్పుడుఏం చేస్తారో చూడాల్సి ఉంది.