తెలంగాణ ఆర్టీసీ స‌మ్మెపై కేంద్రం ఆరా తీస్తోందా..?

తెలంగాణ భాజ‌పా అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ హుటాహుటిన ఢిల్లీకి బ‌య‌ల్దేరి వెళ్ల‌డం కొంత‌ రాజ‌కీయ ప్రాధాన్య‌త క‌లిగిన అంశంగానే చూడాలి. హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కొంత‌మంది ప్ర‌ముఖ నేత‌ల్ని ఆయ‌న్ని క‌లుస్తారు. నిజానికి, వెంట‌నే ఢిల్లీకి రావాలంటూ ఆయ‌న‌కి అక్క‌డి నుంచే పిలుపు వ‌చ్చింది. ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో దీనిపై స్ప‌ష్ట‌మైన వివ‌రాల‌తో రావాలంటూ పిలుపు రావ‌డంతోనే ఆయ‌న బ‌య‌ల్దేరారు అని స‌మాచారం. అంతేకాదు, క‌రీంన‌గ‌ర్ లో ఎంపీ సంజ‌య్ పై దాడి జ‌రిగిందంటూ భాజ‌పా తీవ్రంగా ప్రతిఘ‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై కూడా కేంద్రానికి ల‌క్ష్మ‌ణ్ స‌మాచారం ఇచ్చార‌ని అంటున్నారు! సమ్మె విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం దూకుడును ఆపే అవ‌కాశం ఉందా, ఈ విష‌యంలో కేంద్రానికి ఏదైనా మార్గం ఉందా అనే అంశ‌మే ప్ర‌ధాన అజెండాగా ఆయ‌న ఢిల్లీ వెళ్లార‌ని అనుకోవ‌చ్చు.

ఆర్టీసీ స‌మ్మె మొదలైన ద‌గ్గ‌ర్నుంచీ కేంద్రం తెచ్చిన చ‌ట్టం ప్ర‌కార‌మే నిర్ణ‌యాలు తీసుకునే అధికారం రాష్ట్రాల‌కి ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ చ‌ట్టంలో ఆర్టీసీని ప్రైవేటుప‌రం చేయాల‌నీ, లేదా ఉన్న ఉద్యోగుల‌ను తొల‌గించెయ్యొచ్చు, ఆస్తుల‌ను అమ్ముకోవ‌చ్చు అనే అంశాలు లేవంటూ భాజ‌పా నేత‌లు కౌంట‌ర్ ఇస్తూ వ‌స్తున్నారు. మేం కేంద్రం తెచ్చిన చ‌ట్టం ప్ర‌కార‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నామంటూ కేసీఆర్ అంటున్నా… త‌మ‌పై నింద ప‌డ‌కుండా మొద‌ట్నుంచీ భాజ‌పా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య‌ను తాము మాత్ర‌మే ప‌రిష్క‌రించ‌గ‌లం అనే ఒక వాతావర‌ణాన్ని క్రియేట్ చేస్తోంది.

ఆర్టీసీ జేయేసీ నేత‌ల్ని ఢిల్లీకి తీసుకెళ్లి, కేంద్రానికి ఫిర్యాదు చేయించే ప‌నిలో ల‌క్ష్మ‌ణ్ చొర‌వ తీసుకుంటున్నార‌ని స‌మాచారం. ఆర్టీసీ కార్మిక సంఘాల నేత‌లు 4 లేదా 5న ఢిల్లీకి వెళ్లాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ టూర్ వెన‌క భాజ‌పా ప్రోత్సాహం చాలా ఉంద‌నేది రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం మొండి వైఖ‌రితో ముందుకు పోతోంది కాబ‌ట్టి, ఈ అంశంలో కేంద్రం జోక్యానికి ఉన్న అన్ని మార్గాల‌నూ భాజ‌పా వెతికే ప్ర‌య‌త్నంలో ఉంది. రాజ‌కీయంగా చూసుకుంటే… ఈ అంశంలో భాజ‌పా కాస్త చొర‌వ తీసుకోగ‌లిగితే ఆ పార్టీకి కొంత లాభం గ్యారంటీ! వారి సొంత ప్ర‌యోజ‌నాల వ్యూహం ఎలా ఉన్నా… ఆర్టీసీ స‌మ్మెకు ఒక ముగింపు అయితే కావాల్సిందే. కేంద్రం జోక్యం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com