ఇట్స్ అఫీషియల్..! టీఎస్ఆర్టీసీ సగం ప్రైవేటీకరణ..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్టీసీ సమ్మెపై తేల్చేశారు. కోర్టులు, చట్టాలు.. ఏమీ చేయలేని విధంగా.. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసేసుకున్నారు. యాభై శాతం రూట్లను ప్రైవేటీకరణ చేశారు. మిగిలిన యాభై శాతం… ఆర్టీసీ బస్సులు ఉంటాయన్నారు. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా.. ఆర్టీసీ విషయంపైనే చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

కార్మికులకు ఆఖరి చాన్స్..! ఐదో తేదీలోపు చేరితేనే ఉద్యోగం..!

ఐదో తేదీలోపు ఆర్టీసీ కార్మికులు బేషరతుగా..ఉద్యోగాల్లో చేరాలని.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆఫర్ఇచ్చారు. ఆర్టీసీ విలీనం అనేది జరిగేది కాదని.. యూనియన్ల మాయలో పడి జీవితాలను.. ఆగం చేసుకోవద్దని సూచించారు. ఐదో తేదీ సాయంత్రంలోపు ఉద్యోగులు.. విధుల్లో చేరకపోతే.. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరిస్తామన్నారు. ఆర్టీసీలో 5100 రూట్లను ప్రైవేటీకరణ చేయడానికి కేబినెట్ ఆమోద ముద్ర తెలిపిందని కేసీఆర్ తెలిపారు. కేంద్రం ఇటీవలి ఆమోదించిన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారమే.. తాము చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. లాభాలు వచ్చే రూట్లను ఆర్టీసీకి ఇస్తామని.. కఠినమైన రూట్లను ప్రైవేట్ వాళ్లకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఐదో తేదీ అర్థరాత్రి లోపు.. కార్మికులు విధుల్లో చేరకపోతే.. మిగిలిన ఐదు వేల బస్సులను కూడా ప్రైవేటుకే అప్పగిస్తామని కేసీఆర్ హెచ్చరించారు.

5100 రూట్లలో ప్రైవేటు బస్సులు..! కేంద్ర చట్టం ప్రకారమే..!

49వేల మంది కార్మికుల పొట్టొకొట్టే ఉద్దేశం లేదని… ఆర్టీసీ కార్మికులను మా బిడ్డలనే బావిస్తున్నామని… కేసీఆర్ ప్రకటించారు. నిజానికి ఇప్పుడు సమ్మె చేస్తున్న కార్మికులకు ఆర్టీసీకి సంబంధం లేదని… చిరుద్యోగులను సానుభూతితో చూసిన చరిత్ర తమదని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లలో 67 శాతం జీతాలు పెంచామని.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని.. అందరి కడుపులు నింపాం.. ఎవరి పొట్ట కొట్టే ఉద్దేశం తమకు లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్‌ కోసమే ఆర్టీసీ నిర్ణయమన్నారు. జీవిత కాలం అయి పోయిన 3 వేల బస్సుల స్థానంలో .. కొత్తగా 5100 బస్సులను తీసుకొస్తున్నామని… కొత్తగా బస్సులు ఆర్టీసీ కొనలేదు.. నడపలేదు కాబట్టి ప్రైవేటు బస్సులు వస్తున్నాయన్నారు. ఆర్టీసీ ఉండాలి.. ప్రైవేటు కూడా ఉండాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

విలీనం తెలివితక్కువతనం..!

ఆర్టీసీ విలీనంపై.. కేబినెట్‌లో కూలంకుషంగా చర్చించామని… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తెలివి తక్కువ తనం అని.. అలా చేస్తే దుష్పరిణామాలు ఉంటాయన్నారు. ఆర్టీసీని విలీనం చేస్తే రాష్ట్రంలో 90కి పైగా ఉన్న కార్పొరేషన్ల ఉద్యోగులందరూ అదే డిమాండ్‌తో వస్తారన్నారు. ఆర్టీసీ కార్మికులతో.. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చనిపోయిన కార్మికుల విషయంలో.. వారే బాధ్యత వహించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విలీనం చేశారా.. అని ప్రశ్నించారు. పాలసీల విషయంలో ప్రభుత్వాన్ని ఎవరూ శాసించలేరని కేసీఆర్ తేల్చిచెప్పారు. బీజేపీ శవాలపై పేలాలు ఏరుకుంటోందని మండిపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com