ఆంధ్రప్రదేశ్ కు హోదా సాధ్యం, ప్యాకేజీకి కట్టుబడి ఉన్నాం, ఆర్థిక లోటు తీర్చలేం, ఇతర రాయితీలూ కష్టమే… లీకుల ద్వారా కేంద్రం ఇస్తున్న సంకేతాలు ఇవే. ఆర్థిక శాఖ వర్గాలు అని చెబుతున్నా ఈ లీకులను నిర్ధరించేది ఎవరు..? ప్రధానమంత్రి కార్యాలయమా, ఆర్థిక శాఖా..? ఆంధ్రాలో ఆందోళనలు జరుగుతుంటే, పార్లమెంట్లో ఉభయ సభలూ సజావుగా నిర్వహించలేని పరిస్థితి ఉంటే.. ఇలా లీకులు ఇవ్వడమేంటీ..? వారికి ఇంటెలిజెన్స్ వర్గాలుంటాయి కదా, ఆంధ్రాలో వ్యతిరేకత పెరిగిపోతోందన్న విషయం వాటి ద్వారా తెలియకుండా ఎలా ఉంటుంది. ఇంత జరుగుతున్నా తెలిసే కేంద్రం ఎందుకు మొండిగా వెళ్తున్నట్టు..? అమిత్ షా గానీ, అరుణ్ జైట్లీ గానీ, ప్రధాని నరేంద్ర మోడీగానీ.. ఎందుకంత కఠినంగా మారిపోయారు…? కనీసం రాజకీయంగానైనా ఏదైనా ఒక వ్యూహం ఉండాలి కదా! మోడీ సర్కారు అనుసరిస్తున్న చిత్రమైన వైఖరికి నేపథ్యమేంటి..?
మిత్రపక్షమైన టీడీపీని వదిలించుకోవడమే మోడీ అండ్ కో లక్ష్యమా అనే అనుమానం కూడా ఇప్పుడు వ్యక్తమౌతోంది. అందుకే, సీఎం చంద్రబాబును ఎంతవరకూ రెచ్చగొట్టాలో అంతవరకూ తీసుకొస్తున్నారు. పొత్తు నుంచి టీడీపీ తనకుతానుగా బయటకి పోయే ప్రకటన చేసే వరకూ లాక్కొస్తున్నారు. తద్వారా ఏం సాధిస్తారట..! అంటే, ఏముంది.. తమకు మిత్రపక్షాలతో పనిలేదనీ, శివసేన పోయినా టీడీపీ పోయినా, మరో రాష్ట్రంలో మరో పార్టీ పోయినా నష్టం లేదనే బలమైన సంకేతాలు ఇవ్వడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఒంటరిగానే అత్యంత శక్తివంతంగా ఉన్నామని చాటి చెప్పుకోవడమే ధ్యేయంగా ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో భాజపాకి వచ్చేది లేదూ పోయేదేం లేదు. ఆంధ్రాలో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాల్సిందే. మహా అయితే ఒకటో రెండో ఎంపీ సీట్లు, పొత్తు ద్వారా మరికొంతమంది మద్దతు, అంతే కదా! ఉత్తరాదితోపాటు తూర్పు, ఈశాన్య భారతంలో కూడా భాజపాకి మాంచి పట్టు దొరికిందని భావిస్తున్నారు. కాబట్టే, ఆంధ్రానూ దక్షిణాదినీ ఇంత చిన్నచూపు చూస్తున్నారు.
ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ గెలుస్తామన్న ఒకేఒక్క విజయగర్వంతో అమిత్ షా, మోడీ ద్వయం ఉన్నారు. ఆ లెక్కల్లోనే ఆంధ్రాను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రాలను కేవలం రాజకీయ ప్రయోజనాల దృష్టితో మాత్రమే చూడటం అనేది దారుణం. ఈ ధోరణితో ఆంధ్రాకి మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలకూ ప్రమాదం పొంచి ఉన్నట్టే. తమకు తలొగ్గితేనే మనుగడ, లేదంటే రాష్ట్రాల ప్రయోజనాలను హరించేస్తాం అనే స్థాయి నియంతృత్వ పోకడలకు భాజపా పోతుంటే… మొత్తంగా దేశమే ప్రమాదంలో ఉన్నట్టు లెక్క.