జగన్ కి అదో తుత్తి!

ఓటుకి నోటు కేసులో వచ్చిన కదలికలు యాదృచ్చికంగా వచ్చినవి కావని కనబడుతూనే ఉంది. అది రాజకీయ దురుదేశ్యంతో వచ్చిన కదలికలేనని సాక్షాత్ సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దానికి కారణాలు చాలానే కనబడుతున్నాయి.

రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన తరువాత ఆయన కుర్చీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలనుకొన్నారు. తను ఆయన కొడుకు కావడమే తన ఏకైక అర్హత అని అనుకోవడమే అందుకు కారణం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఆయన జన్మహక్కు అని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, జగన్ కి మాత్రం ఆ హక్కు లేదని భావించడంతో ఆయన పార్టీపై అలిగి బయటకి వచ్చి వేరు కుంపటిపెట్టుకొన్నారు. ఓదార్పు యాత్రలతో ఆయన కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంక్ ని తనవైపు తిప్పుకోవడం చూసి కంగారుపడిన కాంగ్రెస్ అధిష్టానం, సిబిఐ డొంకలాగితే జగన్ అక్రమాస్తుల తీగ కదిలి జైల్లో పడ్డారు. తనని అడ్డం తొలగించుకొనేందుకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి కుట్రలు పన్ని అన్యాయంగా ఆ కేసులలో ఇరికించారని జగన్ స్వయంగా అనేకసార్లు చెప్పుకొన్నారు. అందులో నిజానిజాలు వారికే తెలియాలి. కానీ ఆ ఆరోపణలని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడుపై జగన్ కక్ష పెంచుకోవడానికి అదీ ఒక బలమైన కారణం అనే భావించవలసి ఉంటుంది.

ఆ తరువాత 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడంతో ముఖ్యమంత్రి కావాలనే జగన్ కల నెరవేరలేదు. ఆ ఎన్నికలలో వైకాపా ఘోరపరాజయం పొంది ఉండి ఉంటే జగన్ అంతగా బాధ పడేవారు కాదేమో? కానీ చాల స్వల్ప తేడాతో ఓడిపోవడంతో ఆయన అవేదన చెందడం సహజమే. తన ముఖ్యమంత్రి కలని భగ్నం చేసినందుకు అప్పటి నుంచే చంద్రబాబు నాయుడుపై మరింత కక్ష పెంచుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఈ రెండేళ్ళలో తెదేపా ప్రభుత్వం చేస్తున్న తప్పులని, లోపాలని జగన్ బాగానే ఎత్తి చూపగలుగుతున్నారు. ప్రభుత్వంతో చాలా గట్టిగా పోరాడుతున్నారు. రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదా, పంట రుణాల హామీలో వైఫల్యం, పట్టిసీమ, విశాఖ ఏజన్సీ ఏరియాలో బాక్సైట్ త్రవ్వకాలకి వ్యతిరేకంగా పోరాటం, కాల్ మనీ వ్యవహారం, కాపులకి రిజర్వేషన్లు ఇలాగ చెప్పుకొంటూపోతే చాలా పెద్ద జాబితాయే ఉంది.

ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒకదాని తరువాత ఒకటిగా అయన ఎన్ని సవాళ్ళు విసురుతున్నా, అగ్ని పరీక్షలు పెడుతున్నా అవేవీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆవగింజంత ప్రభావం చూపలేకపోతున్నాయి. తెదేపా ప్రభుత్వం ఏమాత్రం చెక్కు చెదరలేదు. జగన్ విసురుతున్న ఆ సవాళ్ళని అన్నిటినీ అలవోకగా ఎదుర్కొంటూ ముందుకే సాగిపోతోంది. పైగా అందుకు ప్రతిగా 20 మంది వైకాపా ఎమ్మెల్యేలని పట్టుకుపోయింది. అంతే కాదు..తుని విద్వంసం కేసు కూడా వైకాపాకి మెడకి చుట్టే ప్రయత్నాలు చేస్తోంది. డ్రోన్ తీగ లాగితే లోటస్ పాండ్ కదులుతుందన్న తెదేపా నేత వర్ల రామయ్య మాటలే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వైకాపా నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, మెహర్ మొదలైన వారిని ఆ కేసులో ఇరికించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరాజయాలు, అవమానాలు ఆవేశపరుడైన జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోవడం కష్టమే. అందుకే రాన్రాను ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కసి, అసూయ, ద్వేషం ఇంకా పెంచుకొంటూనే ఉన్నారు. ‘ప్రత్యేక అస్త్రాన్ని’ ప్రయోగించినా చంద్రబాబు నాయుడు దాని నుంచి కూడా తప్పించుకొని బయటపడటం జగన్ ఊహించలేని విషయమే. ఓటుకి నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇబ్బందుల గురించి జగన్ కి తెలుసు అందుకే ఆ కేసుని బ్రహ్మాస్త్రంలాగ చంద్రబాబు నాయుడుపై సందించినట్లు భావించవచ్చు. లేకుంటే ఆ కేసుతో అసలు సంబంధమే లేని వైకాపా దానిని కదపవలసిన అవసరమే లేదు. కానీ ఆ బ్రహ్మాస్త్రం కూడా చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేదనే సంగతి బహుశః జగన్ కి కూడా తెలిసే ఉంటుంది. కానీ ఆ పేరుతో చంద్రబాబు నాయుడుని కొంచెం ఇబ్బందిపడేలా చేయగలిగినా, మరికొంత అప్రదిష్ట పాలు చేయగలిగినా జగన్ కి అదో తుత్తి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com