పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల చేతుల్లో తరచూ దాడులకు గురయ్యే బోర్ రామచంద్రయాదవ్ తన రాజకీయాన్ని బీహార్ కు విస్తరించారు. తన పార్టీని అక్కడ కూడా పోటీకి పెడుతున్నారు. పెద్ద సంఖ్యలో కార్లను కాన్వాయ్ గా పెట్టుకుని ఆయన హల్ చల్ చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకుంటున్నారు. బీహార్లో ఆయన ఎన్నికల ఖర్చు చాలా ఎక్కువగా ఉందని.. అది వందల కోట్లలోనే ఉందన్న ప్రచారం అక్కడి మీడియాలో జరుగుతోంది.
BCYP పార్టీ BCల రాజ్యాధికారం కోసం పుట్టిందని చెబుతున్నారు. కానీ తేజస్వి యాదవ్ ను ఓడిస్తామని చెబుతున్నారు. ఆంధ్ర నుంచి బీహార్ కు వచ్చి ఆయన చేస్తున్న రాజకీయంపై అక్కడి పార్టీలు మండి పడుతున్నాయి. ఏపీలో రెండు చోట్ల పోటీ చేసి కనీస ఓట్లు కూడా తెచ్చుకోలేని ఆయన. బీహార్ లో వందల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. “సొంత రాష్ట్రంలోనే విఫలమైనవారికి బీహార్లో ఏమి పని?” అని తిట్లందుకుంటున్నారు.
రామచంద్రయాదవ్ రాజకీయంపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అసలు ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఆయన ఏం వ్యాపారం చేస్తారు అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఉత్తరాదికి చెందిన వారితో మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు. అమిత్ షాతో నేరుగా సమావేశం కాగలిగే పలుకుబడి ఉందని చెబుతూంటారు. ఈ క్రమంలో ఆయన వారి మెప్పును పొందేందుకు రామచంద్రయాదవ్ పేరుతో. యాదవుల మధ్య చీలిక తెచ్చి.. ఆర్జేడీకి నష్టం కలిగించేందుకు ఆయన అక్కడ రాజకీయాలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బులు ఉంటే చాలు.. ఏదైనా రాజకీయం చేయవచ్చని.. ఎక్కడికిఅయినా పోయి ప్రజల్ని బకరాలను చేయవచ్చని.. రామచంద్రయాదవ్ లాంటి వారు అనుకుంటూ ఉండటం వల్లనే రాజకీయాలు ఇలా తయారవుతున్నాయి.