గోవా గవర్నర్ అయిన అశోక్ గజపతిరాజు మీద ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన బొత్స సత్యనారాయణకు చాలా అసూయ ఉన్నట్లుగా ఉంది . ఎలాగోలా విమర్శించేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే విమర్శించారు. ఏమని అంటే.. ఆయనకు చాలా అహంకారమట. ఎందుకంటే .. రిషికొండ ప్యాలెస్ ను పిచ్చాసుపత్రిగా మార్చమన్నారని సలహా ఇచ్చినందుకు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ విషయంపై అశోక్ గజపతిరాజు ఇటీవల స్పందించారు. తనతో ఉచిత సలహా అని..దాన్ని పిచ్చాసుపత్రిగా మార్చి.. అది కట్టించిన వారిని చేర్చాలన్నారు.
దీంతో బొత్సకు కోపం వచ్చింది. వారానికి రెండు, మూడు రోజులు అయినా ప్రెస్ మీట్ పెట్టడం ఆయన డ్యూటీ. అందుకే ప్రెస్ మీట్ పెట్టారు.. అన్నింటిపై మాట్లాడారు.. దాంతో పాటు అశోక్ గజపతిరాజునూ విమర్శించారు. ప్రజాధనంతో కట్టిన భవనాన్ని పిచ్చాసుపత్రిగా మార్చమంటారా.. మీది అహంకారం.. పుట్టుకతో వచ్చిన రాజుల అహంకారం ఆయనదని మండిపడ్డారు. అది పోదన్నారు.
అయితే పిచ్చాసుపత్రిని మాత్రం ప్రజాధనంతో కట్టరా అన్నది అందరికీ వచ్చే సందేహం. పిచ్చాసుపత్రి అంటే.. అదేదో తప్పు అయిన కట్టడం అన్నట్లుగా ఆయన చెబుతున్నారు. మామూలు ఆస్పత్రి అయినా.. పిచ్చాసుపత్రి అయినా ప్రభుత్వానిది అయితే ప్రజాధనంతోనే కట్టాలి. ఇక్కడ అశోక్ గజపతిరాజును ఎలా విమర్శించాలో తెలియక.. అలా విమర్శించేసి..ఆయనపై అహంకారం ముద్ర వేస్తున్నారు. అశోక్ గజపతిరాజు ఎంత సింపుల్ గా ఉంటారో.. ఆయనకు అహంకారం ఉందో లేదో.. దశాబ్దాలుగా తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు.