బొత్స సత్యనారాయణకు రోజూ ప్రెస్ మీట్ పెట్టాలని టాస్క్ ఇచ్చారో ఏమో కానీ ఆయన ప్రెస్మీట్లు పెట్టి వైసీపీ నిర్వాకాలను సమర్థించలేక నవ్వుల పాలవుతున్నారు. వివేకానందరెడ్డి హత్యపై జగన్, అవినాష్ రెడ్డిని సమర్థించేందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి.. సునీతపై విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆమె వస్తున్నారని.. వివేకా హత్యకేసును చంద్రబాబు ఎందుకు తేల్చలేదని అంటున్నారు.
2019 ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ప్రకటన కోసం జగన్ పులివెందుల రావాల్సి ఆసమయంలో వివేకా హత్య జరిగింది. అప్పటికే ప్రభుత్వాన్ని ఈసీ గుప్పిట్లోకి తీసుకుంది. వైసీపీ నేతలు ఉన్నతాధికారులందర్నీ బదిలీ చేయించారు. హత్య జరిగిన తరవాత ఎన్నికలతో సంబంధం లేకపోయినా వివేకా కేసు దర్యాప్తు అధికారిని కూడా బదిలీ చేయించారు. ఇదంతా బొత్సకు తెలియదని కాదు. కానీ ఆయన సమర్థిస్తున్నారు.
బొత్స సత్యనారాయణ రాజకీయంగా మనుగడ సాగించడానికి ఎన్ని అయినా చేయవచ్చు కానీ ఇలా తమ పార్టీ అధ్యక్షుడి నిర్వాకాలను సమర్థించడం మాత్రం అత్యంత ఘోరం. హత్యలు, నేరాలు ఘోరాలను సమర్థించడం బొత్స లాంటి నాయకుడికి భవిష్యత్ లో చేటు తెస్తుంది. ఆ రాజకీయ భవిష్యత్ కోసమే ఇలా మాట్లాడుతున్నానని ఆయన అనుకుంటున్నట్లుగా ఉన్నారు. కానీ తన మాటలతో ఇంత కాలం నిర్మించుకున్న ఓ గౌరవకోటను తానే కూల్చేసుకుంటున్నారన్న విషయం మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు.