ఎట్ట‌కేల‌కు బ్ర‌హ్మీకి ఓ ఛాన్సు

ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం లేనిదే సినిమా ఉండేది కాదు. బ్ర‌హ్మీ ఒక్క‌డే సినిమాని న‌డిపించిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. బ్ర‌హ్మానందం ట్రాక్ బాగుంటే – సినిమా ఆడేసేది. అయితే ఇప్పుడు ఆ హ‌వా ఎక్క‌డా లేదు. చేతిలో సినిమాల్లేక బ్ర‌హ్మీ సైడ్ అయిపోయాడు. కొత్త‌త‌రం క‌మెడియ‌న్లు ఎక్కువైపోవ‌డ‌మో, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ల హ‌వాలో కామెడీకి స్కోప్ లేక‌పోవ‌డ‌మో, బ్ర‌హ్మానందం భారీ రెమ్యున‌రేష‌న్ల వ‌ల్లో – బ్ర‌హ్మీ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఈమ‌ధ్య బ్ర‌హ్మనందం ఆరోగ్యం కూడా పాడైంది. ఆప‌రేష‌న్ జ‌రిగాక ఆయ‌న ఎక్కువ‌గా రెస్ట్ మోడ్‌లోనే ఉంటున్నాడు. అలాంటి బ్ర‌హ్మాంనందానికి రాక రాక ఓ అవ‌కాశం వ‌చ్చింది. అదీ మెగా సినిమాలో.

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `వాల్మీకి`లో బ్ర‌హ్మానందంకి ఓ రోల్ ద‌క్కింది. దాదాపుగా ఇది గెస్ట్ అప్పీరియ‌న్స్ లాంటిదే. అయితే.. బ్ర‌హ్మీ చ‌మ‌క్కులు మాత్రం ఓ రేంజులో ఉంటాయ‌ని తెలుస్తోంది. సినిమా అంతా పూర్త‌య్యాక‌.. బ్ర‌హ్మానందం పాత్ర పెడితే బాగుంటుంద‌ని హ‌రీష్‌కి అనిపించింద‌ట‌. దాంతో… బ్ర‌హ్మానందం కోసం ఓ సీన్ రాసేశాడు. అన్న‌ట్టు ఈ సినిమాలో తెలుగు చిత్ర‌సీమ‌కు చెందిన కొంత‌మంది ద‌ర్శ‌కులు కూడా క‌నిపించ‌బోతున్నారు. సుకుమార్ తో స‌హా. వ‌రుణ్ తేజ్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం.. ఈనెల 20న రాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com