బ్రహ్మానందం… దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని నవ్విస్తున్న హాస్య బ్రహ్మ! ఆయన తెరపై కనిపించాల్సిన అవసరం లేదు, ఆ రూపు మదిలో మెదిలినా, ఓ చిన్న చిరునవ్వు పెదాలపై పరచుకొంటుంది. బ్రహ్మానందాన్ని గుర్తు చేసుకోకుండా, ఆయన మీమ్స్ చూడకుండా గడిచిన రోజు ఉండదేమో? అంతలా తెలుగువారి జీవితాలతో పెనవేసుకుపోయారు. కొంతకాలంగా ఆయన సినిమాలకూ, షూటింగులకూ దూరంగా గడుపుతున్నారు. మనసుకు నచ్చిన పాత్ర వస్తే కానీ ఒప్పుకోవడం లేదు. ఈ గ్యాప్‌లో ఆయన తన ఆత్మకథని కూడా రాసుకొన్నారు. దాని పేరు ‘నేను.. మీ బ్రహ్మానందం’. త్వరలోనే ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారు.
బ్రహ్మానందం మంచి నటుడే కాదు, ఓ ఫిలాసఫర్ కూడా. తెలుగు మాస్టారు కాబట్టి, భాషపై మాంఛి పట్టుంది. చిత్రకారుడు కూడానూ. ఇంకా ఆయనలో చాలా చాలా కోణాలున్నాయి. అవన్నీ.. ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి రానున్నాయి. బ్రహ్మానందంతో చాలామంది హీరోలకు, దర్శకులకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకూ చక్కటి అనుబంధం ఉంది. వాళ్లతో ముడిపడిన జ్ఞాపకాల్ని, తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లని బ్రహ్మానందం ఈ పుస్తకం ద్వారా పంచుకోబోతున్నారు. డిసెంబరులో ఈ పుస్తకం విడుదలయ్యే ఛాన్సుంది.