భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు బ్రాండెడ్ రెసిడెన్సెస్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. సాధారణంగా ఒక అపార్ట్మెంట్ అంటే కేవలం బిల్డర్ నిర్మించే భవనం . కానీ, బ్రాండెడ్ రెసిడెన్స్ అంటే ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ బ్రాండ్ల భాగస్వామ్యంతో నిర్మితమయ్యే ఇళ్లు. గతంలో ఇవి కేవలం ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితం కాగా, ఇప్పుడు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఇవి వేగంగా విస్తరిస్తున్నాయి. వర్క్-ఫ్రమ్-హోమ్ సంస్కృతి తర్వాత, ఇంటిలోనే ఫైవ్-స్టార్ హోటల్ వంటి వసతులు ఉండాలని కోరుకునే వారు ఈ బ్రాండెడ్ ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచస్థాయి జిమ్, స్పా, కన్సీర్జ్ సర్వీసెస్ , హై-లెవల్ సెక్యూరిటీ ఉండటం వల్ల సంపన్న వర్గాలు వీటిని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.
ఈ ట్రెండ్ ఇప్పుడు కేవలం మెట్రోలకే పరిమితం కాకుండా విశాఖపట్నం, విజయవాడ, చండీగఢ్, పూణే , జైపూర్ వంటి టైర్-2 నగరాలకు కూడా పాకింది. ఈ నగరాల్లో స్థల లభ్యత ఎక్కువగా ఉండటం, నిర్మాణ వ్యయం మెట్రోలతో పోలిస్తే తక్కువగా ఉండటంతో డెవలపర్లు అంతర్జాతీయ బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇక్కడ ఉండే ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా తమ సామాజిక హోదాను చాటుకోవడానికి ఈ బ్రాండెడ్ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
సాధారణ ఇళ్లతో పోలిస్తే బ్రాండెడ్ రెసిడెన్సెస్ ధరలు 20% నుండి 35% వరకు ఎక్కువగా ఉన్నప్పటికీ, వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల రీసేల్ వాల్యూ కూడా భారీగా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ బ్రాండ్ల పర్యవేక్షణలో మెయింటెనెన్స్ ఉండటం వల్ల భవనం విలువ కాలక్రమేణా తగ్గదు. రాబోయే ఐదేళ్లలో భారతదేశంలోని ప్రధాన మరియు అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఈ తరహా ప్రాజెక్టుల వాటా 15% మేర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
