రివ్యూ: బ్రోచేవారెవ‌రురా

తెలుగు360 రేటింగ్‌: 3/5

తెలిసిన క‌థ‌ని కొత్త‌గా చెప్పాలి
కొత్త క‌థ‌ని తెలిసేట్టుగా చెప్పాలి

ఈ రెండూ తెలిస్తే హిట్టు సినిమా తీయ‌డం అర్థ‌మైపోయిన‌ట్టే. కాక‌పోతే ఈ లాజిక్ ద‌గ్గ‌రే చాలామంది బోల్తా కొట్టేస్తుంటారు. కొత్త క‌థ‌ని ఇంకాస్త కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నంలో తాము క‌న్‌ఫ్యూజ్ అయిపోయి, క‌థ‌ని క‌న్‌ఫ్యూజ్‌లోకి నెట్టేస్తుంటారు. దాంతో ప్యూజ్ కొట్టేస్తుంది. వివేక్ ఆత్రేయ మాత్రం ఈ లైన్‌ని బాగా అర్థం చేసుకున్నాడేమో అనిపిస్తుంది.

త‌న తొలి సినిమా `మెంట‌ల్ మ‌దిలో`. ఓ క‌న్‌ఫ్యూజ్ కుర్రాడి క‌థ అది. దాన్ని క‌న్‌ఫ్యూజ్ అవ్వ‌కుండా తెర‌పై చూపించి, పాసైపోయాడు. ఇప్పుడు రెండో సినిమా.. `బ్రోచేవారెవ‌రురా`. ఇదో కిడ్నాప్ డ్రామా. అందులో కొన్ని ట్విస్టులూ, ట‌ర్న్‌లు. ఆ ట్విస్టుల మ‌ధ్య తాను త‌ప్పికోకుండా, ఆ ట‌ర్న్‌లు వ‌దిలేసి యూ ట‌ర్న్ తీసుకుని రాకుండా – చెప్పాల్సింది అర్థ‌మ‌య్యేలా, ఆస‌క్తిగా చెప్ప‌డంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యాడు. అదెలాగంటే…

ఆర్ త్రీ అనే ఓ అల్ల‌రి బ్యాచ్ ఉంది. వాళ్లే రాహుల్ (శ్రీ విష్ణు), రాకీ (ప్రియ‌ద‌ర్శి), రాంబో (రాహుల్ రామ‌కృష్ణ‌). వీళ్లు చ‌దివేది త‌క్కువ‌. రోడ్ల‌పై తిరిగేది ఎక్కువ‌. దాంతో ప్ర‌తీ ప‌రీక్షా త‌ప్పుతుంటారు. ఇదే కాలేజీలోకి మిత్ర (నివేదా థామ‌స్‌) అడుగుపెడుతుంది. త‌న బాధ‌లు త‌న‌వి. తండ్రి ఆ కాలేజీకే ప్రిన్స్‌పాల్‌. కానీ కాలేజీలో ఉన్న‌ట్టు ఇంట్లోనూ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండ‌మంటాడు. త‌న‌కు ఇష్ట‌మైన భ‌ర‌త‌నాట్యాన్ని దూరం చేస్తాడు. ఆమె బాధ‌లు అర్థం చేసుకున్న ఆర్ త్రీ బ్యాచ్‌… ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఓ ద‌శ‌లో మిత్ర ఇల్లు వ‌దిలి వెళ్లిపోవాల‌నుకుంటుంది. అందుకు డ‌బ్బులు కావాలి క‌దా? ఆ డ‌బ్బులు సంపాదించ‌డానికి త‌న‌ని కిడ్నాప్ చేసి, ఇంట్లో డ‌బ్బులు డిమాండ్ చేయ‌మంటుంది. అలా… ఎనిమిది ల‌క్ష‌ల కోసం కిడ్నాప్ డ్రామా మొద‌లెడ‌తారు. ఆ డ్రామా వ‌ల్ల‌.. ఎవ‌రు ఎలాంటి క‌ష్టాల్లో ప‌డ్డారు? అందులోంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? ఈ క‌థ‌కీ, విశాల్ (స‌త్య‌), షాలినీ (నివేదా పేతురాజ్‌)కీ ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెర‌పై చూడాలి.

వాళ్ల‌ని వాళ్లే కిడ్నాప్ చేసుకుని, ఇంట్లో డ‌బ్బులు వ‌సూలు చేసే కిడ్నాప్ డ్రామాలు చాలా చూశాం. మ‌నీ అందుకు శ్రీ‌కారం చుట్టింది. మొన్నొచ్చిన `దొంగాట‌`లోనూ ఇదే ఫార్ములా క‌నిపించింది. వివేక్ ఆత్రేయ కూడా అంత వ‌ర‌కూ ఆలోచిస్తే… ఈ బ్రోచేవారెవ‌రురా గురించి అస‌లు ఆలోచించాల్సిన అవ‌స‌ర‌మే ఉండేది కాదు. ఆ త‌ర‌వాత కొన‌సాగింపుగా మ‌రో కిడ్నాప్ డ్రామాని అల్లుకున్నాడు. అక్క‌డే వివేక్ `పెన్‌`త‌న‌ము బ‌య‌ట‌ప‌డుతుంది. ఓ ద‌ర్శ‌కుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ క‌థ మొద‌ల‌వుతుంది. విశాల్ అనే ద‌ర్శ‌కుడు షాలినీ అనే హీరోయిన్‌కి క‌థ చెబుతున్న‌ప్పుడు – `బ్రోచేవారెవ‌రురా` క‌థ మొద‌లైంది. ఆ క‌థ‌కి స‌మాంత‌రంగా కిడ్నాప్ డ్రామా న‌డుస్తుండ‌డం, ఇదే క‌థ‌లోకి దర్శ‌కుడి కూడా రావ‌డం మంచి స్క్రీన్ ప్లే టెక్నిక్‌.

క‌థ‌ని చాలా స‌ర‌దాగా మొద‌లెట్టి, చిన్న చిన్న ట్విస్టులు ఇచ్చుకుంటూ, ఇంట్ర‌వెల్ కార్డ్ వ‌ర‌కూ హాయిగా లాక్కెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు. కాలేజీ సీన్లు, పేప‌ర్లు దొంగిలించే ప్ర‌య‌త్నం, క్లాసు రూమ్ లో మార్కులు చ‌దువుతున్న‌ప్పుడు పుట్టిన కామెడీ స‌ర‌దాగా ఉంది. పంచ్‌ల కోసం తాప‌త్ర‌య‌ప‌డ‌కుండా, స‌హ‌జ సిద్ధ‌మైన డైలాగుల‌తో, ఎక్స్‌ప్రెష‌న్స్ తో న‌వ్వించారు. కిడ్నాప్ కోసం వేసే స్కెచ్‌లు, `ఈ కిడ్నాప్ ఈ ముగ్గురూ చేసుండ‌రు` అని గుడ్డిగా వాదించే సీ.ఐ (హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌) చేసే సైలెంట్ కామెడీ భ‌లే బాగా న‌వ్విస్తాయి.

ద్వితీయార్థంలో మ‌రో కిడ్నాప్ డ్రామా మొద‌ల‌వుతుంది. తొలి స‌గంలో వ‌చ్చే కిడ్నాప్ న‌వ్వించ‌డానికి అయితే, రెండో స‌గంలో వ‌చ్చే కిడ్నాప్ థ్రిల్ కోసం. ఈ కిడ్నాప్ నుంచి ఎవ‌రెలా త‌ప్పించుకుంటారో అనే ఆసక్తి నెల‌కుంటుంది. హీరో ఫోన్ మాయం చేసి – ఈ క‌థ‌ని మ‌రో మ‌లుపు తిప్పాడు ద‌ర్శ‌కుడు. కాక‌పోతే ఆ ఫోన్ చుట్టూ దాదాపు అర‌గంట సినిమా తిప్ప‌డం మాత్రం ఇబ్బంది క‌లిగిస్తుంది. ఫోన్ దొరికేస్తే.. త‌ర‌వాతి క‌థ చెప్ప‌డానికి ఏం ఉండ‌దు. అందుకే దాని చుట్టూ క‌థ న‌డిపించ‌డానికి సినిమాని సాగ‌దీశాడు. ఫోన్ పోయిన వెంట‌నే.. డూప్లికేట్ సినిమా తెచ్చుకుంటే అయిపోతుంది క‌దా? అనే ప్ర‌శ్న ప్రేక్ష‌కుడికి వ‌స్తే ఆ త‌ప్పు అత‌నిది మాత్రం కాదు. మొత్తానికి ఓ చిన్న పాయింట్ ప‌ట్టుకుని, దాన్ని వినోదాత్మ‌కంగా, ఆస‌క్తిగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. క్లైమాక్స్ కూడా బాగా రాసుకుని ఉండి ఉంటే.. `మ‌నీ`లా మిగిలిపోయే సినిమా అవుదును.

న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు తెలివిమీరిపోయారు. త‌మ పాత్ర‌కు త‌గిన న‌టీన‌టుల్ని వెదికి ప‌ట్టుకుంటున్నారు. ఈ సినిమాలోనూ అంతే. మిస్ కాస్టింగ్ అనేది మ‌చ్చుకైనా క‌నిపించ‌దు. శ్రీ‌విష్ణు ద‌గ్గ‌ర్నుంచి బిత్తిరి స‌త్తి వ‌ర‌కూ.. ప్ర‌తీ పాత్రా పెర్‌ఫెక్ట్ ఛాయిస్‌. శ్రీ‌విష్ణు, స‌త్య ఎప్ప‌టి అత్యంత స‌హ‌జంగా న‌టించారు. శ్రీ విష్ణు ఈసారి కాస్త కామెడీ ఎక్కువ‌గా చేశాడు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ అల‌వాటు ప్ర‌కారం బాగా న‌వ్వించారు. నివేదా, నివేదా పేతురాజ్‌.. ఇద్ద‌రి పాత్ర‌ల‌కూ ప్రాధాన్యం ఉంది. తొలి స‌గంలో నివేదా థామ‌స్ కూడా అల్ల‌రి చేసింది. ద్వితీయార్థంలో త‌ను కిడ్నాప్ అయిపోయింది కాబ‌ట్టి – ఆ పాత్ర‌కు అంత స్కోప్ లేకుండాపోయింది.

బ్యాక్ గ్రౌండ్ స్కో్ర్‌కి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. మాట‌లు చాలా స‌హ‌జంగా ఉన్నాయి. సినిమాటిక్ ఎక్స్‌ప్రెష‌న్స్ చాలా త‌క్కువ‌. ఇలాంటి సినిమాల‌కు బిగుతైన స్క్రీన్ ప్లే చాలా అవ‌స‌రం. వివేక్ ఆత్రేయ ఆ విష‌యంలో లోటు చేయ‌లేదు. క్లైమాక్స్ విష‌యంలో కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది.

మొత్తానికి బ్రోచేవ‌రారెవ‌రు నిరాశ ప‌ర‌చ‌దు. హాయిగా న‌వ్విస్తూ, మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఉత్కంఠ‌త‌కు గురి చేస్తూ.. సాగిపోయింది. మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా స్థాయిని నిర్ణ‌యించేది బీ, సీ ప్రేక్ష‌కులే. వాళ్లూ ఈ సినిమాకి ఓటేస్తే… క‌మ‌ర్షియ‌ల్‌గానూ ఈ సినిమా పాసైపోతుంది.

ఫినిషింగ్ ట‌చ్‌: ‘మ‌నీ’కి అడ్వాన్స్ వెర్ష‌న్‌

తెలుగు360 రేటింగ్‌: 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com