కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో భారత రాష్ట్ర సమితి సింగిల్ పాయింట్ ఎజెండాను అమలు చేస్తోంది. ఆ ప్రాజెక్టు వరప్రదాయని అని చెప్పేందుకు.. ఎక్కడ నీరు కనిపించినా అవి కాళేశ్వరం నీళ్లే అని చెప్పేందుకు ఏ మాత్రం సంశయించడం లేదు. దీంతో ప్రజలు కూడా సెటైర్లు వేయడం ప్రారంభించారు. వర్షం పడి నీళ్లు పారితే.. అవి కూడా కాళేశ్వరం నీళ్లేనని.. నదులకు కేసీఆర్ నడక నేర్పారని జోకులు వేసుకుంటున్నారు. అధిక ప్రచారం వల్ల జరిగే అనర్థాలు ఇవి. తాము చెప్పేవి నమ్ముతున్నారా లేదా అన్నది చూసుకోకుండా చేసే పనుల వల్ల.. ఇతర పార్టీలు నిజంగా ఏమైనా ఆ ప్రాజెక్టు వల్ల మేలు జరిగి ఉంటే.. వాటి క్రెడిట్ ను కూడా రాకుండా చేస్తున్నాయి.
ఏ నీళ్లైనా కాళేశ్వరం నుంచేనా !
హైదరాబాద్కు గోదావరి జలాలను తీసుకు వచ్చేందుకు గండిపేట వద్ద రేవంత్ రెడ్డి ఓ పథకానికి శంకుస్థాపన చేశారు. వెంటనే కేటీఆర్ ప్రెస్మీట్ పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ద్వారా ఎత్తి పోసిన నీటినే .. రేవంత్ హైదరాబాద్ కు తెస్తున్నారని తేల్చేశారు. మల్లన్నసాగర్ నుంచి ఆ నీటిని తరలిస్తున్నారని అవి కాళేశ్వరం జలాలని వాదించారు. అదే సమయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎల్లంపల్లి నుంచి మాత్రమే నీటిని ఎత్తిపోస్తున్నామని ఆ నీరే హైదరాబాద్కు వస్తోందని స్పష్టం చేశారు.
కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయలేదుగా.. ఎక్కడి నుంచి వచ్చాయి ?
నిజానికి ఈ సీజన్ లో కాళేశ్వరం పంపులు పని చేయలేదు. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదు. ఆ బ్యారేజీ ఇంకా కుంగిపోయి ఉంది. నీళ్లు నిల్వ చేస్తే కొట్టుకుని పోతుంది. మరమ్మతులు చేయడం సాధ్యం కాదని మళ్లీ నిర్మించాలని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఇతర రెండు బ్యారేజీల్లోనూ లోపాలు ఉండటంతో నీటి నిల్వ సాధ్యం కావడం లేదు. ఇలాంటి సమయంలో కాళేశ్వరం నుంచి నీరు వచ్చాయని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఎల్లంపల్లితో పాటు ఇతర పథకాల ద్వారా వచ్చిన నీటిని కాళేశ్వరం నీరు అని బీఆర్ఎస్ నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. అవి కూడా కాళేశ్వరంలోభాగమని వాదిస్తున్నారు.
బీఆర్ఎస్ అతి ప్రచారంతోనే అసలు సమస్య
భారత రాష్ట్ర సమితి హయాంలో కాళేశ్వరం పేరుతో ఓ విస్తృతమైన ప్రాజెక్టు నిర్మించింది. దాని ఉపయోగాలు, ప్రయోజనాలు, ఖర్చు వీటన్నింటిపై ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేకపోయింది. అందుకే ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ చెప్పేదే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తోంది. అదే సమయంలో తెలంగాణలో అంతకు ముందు సాగునీటి ప్రాజెక్టులే లేవు.. కాళేశ్వరం మాత్రమే కేసీఆర్ కట్టారు..దాని ద్వారానే నీళ్లు వస్తున్నాయని చెప్పుకునే ప్రయత్నం ఎబ్బెట్టుగా మారుతోంది. ముందు నుంచి చేసుకున్న అతి ప్రచారం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.