ఏపీ సర్కార్ నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు చేపడుతోందని అధికారవర్గాలకే స్పష్టంగా తెలియదు. ఓ ఆలోచన చేశారు. సముద్రంలోకి పోయే నీటిని మళ్లించుకుని అక్కడ నిల్వ చేసుకుంటే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచించింది. వెంటనే హరీష్ రావు రంగంలోకి దిగిపోయారు. బనకచర్లకంటే నల్లమల సాగరే డేంజరని.. తెలంగాణను దోపిడీ చేస్తూంటే రేవంత్ కళ్లు మూసుకున్నారని రాజకీయం ప్రారంభించారు. ఇదే కాదు.. చివరికి సంక్రాంతికి హైవేపై ట్రాఫిక్ జామ్ అయిపోతుందన్న భయంతో.. టోల్ గేట్ల వద్ద ఆగకుండా సాఫీగా సాగాలని టోల్ ఫీజులు వద్దని కోమటిరెడ్డి లేఖ రాస్తే.. ఏపీ ప్రజలకు బహుమతి ఇస్తున్నారు..మరి తెలంగాణ ప్రజలకు ఊరెళ్తూంటే టోల్ వసూలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇవి కాదు… ఏం చేసినా ఏపీనే బూచిగా చూపిస్తున్నారు. వారికి బోరు కొట్టడం లేదమో కానీ తెలంగాణ ప్రజలు కూడా.. ఇదేంది..మామా అని ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
భారత రాష్ట్ర సమితి పేరు – చేసేది ప్రాంతీయ విద్వేష రాజకీయం
బీఆర్ఎస్ పార్టీ తన పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితి గా మార్చుకున్నప్పుడు, తాము కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని ప్రకటించింది. కానీ, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్, ఏపీ ప్రాజెక్టుల చుట్టూనే తన రాజకీయాన్ని తిప్పుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత కేసీఆర్ దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోవాలని చూశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, పార్టీ ఆంధ్రా విద్వేషమే తమ పార్టీకి రక్ష అనుకుని ఆ లైన్ లోకి వస్తున్నారు.
ప్రాంతీయ విద్వేషాలతో ఇంకెంత కాలం?
ఏపీ ప్రభుత్వం తన పరిధిలో వరద నీటిని వాడుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్న ప్రతిసారీ, అది తెలంగాణను దోచుకోవడమే అని బీఆర్ఎస్ గగ్గోలు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. దిగువ రాష్ట్రంగా ఏపీకి ఉండే హక్కులను, వారి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూడటం వల్ల రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే కేసీఆర్కు కావాల్సింది ఇదే. గతంలో కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి పని చేసినప్పుడు లేని అభ్యంతరాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
టోల్ ఫ్రీ ప్రయాణంపై రాజకీయమా?
సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా టోల్ ఫ్రీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి లేఖ రాయడంపై కూడా బీఆర్ఎస్ విమర్శలు గుప్పించడం ఆశ్చర్యకరంగా మారింది. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఏదైనా పండుగల సమయంలో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి. సంక్రాంతి సందర్భంగా ఈ సారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకే అక్కడ ఆగకుండా.. వెళ్లిపోయేలా చూడాలని కోమటిరెడ్డి ప్రయత్నించారు. దానికే వక్రభాష్యం చెప్పిన బీఆర్ఎస్.. ఏపీ ప్రజలకు సంక్రాంతి బహుమతి ఇస్తున్నారని.. తెలంగాణ జాతీయ రహదారులపైనా టోల్ తీసేయాలని అంటున్నారు. వీరి తీరుతో అందరికీ ఇదేం ప్రాంతీయ విద్వేషం అనుకోవాల్సి వస్తోంది.
ప్రజలు ఇలాంటి రాజకీయాలను స్వాగతిస్తారా?
నేటి ఓటర్లు ఎంతో చైతన్యవంతులు. కేవలం సెంటిమెంట్ మీద మాత్రమే ఓట్లు పడవని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. జాతీయవాదం అని చెప్పి మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను ప్రోత్సహిస్తే, అది పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. నిరంతరం ఏపీపై విమర్శలు చేయడం వల్ల బీఆర్ఎస్కు కొంతకాలం మీడియా మైలేజీ రావచ్చు కానీ, దీర్ఘకాలంలో ఇది పార్టీకి నష్టమే. సొంత రాష్ట్రంలో ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పక్క రాష్ట్రంపై నిందలు వేయడం అనేది పాతకాలపు రాజకీయ వ్యూహం. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ ,ఏపీ మధ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి తప్ప, ప్రతిదానిని దోపిడీ గా చిత్రీకరించడం వల్ల రాష్ట్రాల మధ్య వైషమ్యాలు తప్ప సాధించేదేమీ ఉండదన్నది అందరూ నమ్మే నిజం…ఒక్క బీఆర్ఎస్ తప్ప..!
