తెలంగాణ అసెంబ్లీలో అధికార పార్టీతో పాటు తమకూ పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. లేకపోతే అన్యాయమని ఆరోపణలు చేస్తోంది. అది అన్యాయమా కాదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు కానీ.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షాలను ఎంత మేర పరిగణనలోకి తీసుకుంది.. వారి వాయిస్ కు ఎంత మేర అవకాశం కల్పించిందన్నది గుర్తు చేసుకుంటే .. బీఆర్ఎస్ పార్టీ తాము విపక్షానికి ఎప్పుడూ ఇవ్వని కించిత్తు గౌరవాన్ని తాము భారీగా కోరుకుంటోంది.
పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్య చర్చలు
బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు తగిన సమయం ఇచ్చేవారు కాదు. చిన్న చిన్న కారణాలతో సస్పెన్షన్లు చేయడం, మైకులు కట్ చేయడం వంటి ఘటనలు అప్పట్లో నిత్యకృత్యంగా ఉండేవి. సభలో చర్చల కంటే ఏకపక్ష నిర్ణయాలకే ప్రాధాన్యత ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తూ చర్చలకు వేదికగా అసెంబ్లీని మారుస్తున్నారు.దానికి ఇప్పటి వరకూ సాగిన అసెంబ్లీ తీరే సాక్ష్యం అనుకోవచ్చు.
కేసీఆర్ పీపీటీ – ఆనాటి ఏకపక్ష ధోరణి
2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో సుదీర్ఘంగా పీపీటీ ఇచ్చారు. ఆ సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తమ వాదనను ప్రజెంటేషన్ ద్వారా వినిపిస్తామని, తమకూ అవకాశం ఇవ్వాలని బతిమిలాడినా బీఆర్ఎస్ కనికరించలేదు. ప్రభుత్వానికి మాత్రమే ప్రజెంటేషన్ ఇచ్చే హక్కు ఉంది అని నాడు బీఆర్ఎస్ నేతలు కరాఖండిగా చెప్పారు. ప్రతిపక్షం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ ప్రజెంటేషన్ రూపంలో సమాధానం చెప్పే వీలు కల్పించకుండా కేసీఆర్ తన వాదననే ఏకపక్షంగా వినిపించారు. కానీ ఇప్పుడు మాత్రం తమకూ పీపీటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
తాము చేయనిది.. ఇప్పుడు కావాలని పట్టు
చిత్రమేమిటంటే, నాడు ప్రతిపక్షానికి ఏ అవకాశాన్నైతే నిరాకరించారో, నేడు అదే అవకాశాన్ని తమకు కల్పించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వనున్న పీపీటీకి కౌంటర్‌గా తాము కూడా ప్రజెంటేషన్ ఇస్తామని, తమకు ఆ హక్కు ఉందని స్పీకర్‌ను కోరుతున్నారు. నాడు ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన వారు, నేడు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఈ డిమాండ్ పై కాంగ్రెస్ నేతలంటున్నారు. బీఆర్ఎస్ ఒత్తిడిపై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ ఏ సంప్రదాయాన్ని పాటించిందో, తాము కూడా అదే బాటలో నడుస్తామని సంకేతాలు ఇస్తోంది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించి ఉంటే.. ఇప్పుడీసమస్యలు వచ్చేవి కావని అనుకోవచ్చు.
