రేవంత్ రెడ్డి చేస్తున్న బీసీ రాజకీయాన్ని తిప్పికొట్టాలని తమకు అనువుగా మార్చుకుందామని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటే..ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. బీసీలను రేవంత్ మోసం చేశారని ప్రచారం చేయడంతో పాటు స్థానిక ఎన్నికలకు సమాయత్తవడానికి బాగుంటుందని కరీంనగర్లో సభను ప్లాన్ చేశారు. భారీగా ఏర్పాట్లు చేయాలనుకున్నారు. మొదటగా ఆగస్ట్ ఎనిమిదో తేదీన డేట్ ఖరారు చేశారు. జన సమీకరణ సన్నాహాలు ప్రారంభించారు.
అయితే భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆ రోజు పెట్టుకుంటే నిండా మునిగిపోతామని చెప్పి తదుపరి వారానికి వాయిదా వేసుకున్నారు. ఆగస్టు పధ్నాలుగో తేదీన ధూం..ధాంగా నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అదే రోజున భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వర్గాలు ప్రకటించాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మరో గత్యంతరం లేకపోయింది. ఆగస్ట్ 14న జరగవలసిన కరీంనగర్ బీఆర్ఎస్ బీసీ సభ వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో 14,15,16,17 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ సూచనలు మేరకు మరియు ప్రభుత్వ ముందస్తు హెచ్చరికల మేరకు సభను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. గతంలో వాయిదా వేసినప్పుడు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించారు. కానీ ఈ సారి మాత్రం అలాంటి ప్రకటన చేయలేదు. బీసీ రిజర్వేషన్ల టాపిక్ వేడి మీద లేదని.. మళ్లీ ఆ టాపిక్ వచ్చినప్పుడు సభ పెట్టుకుందామని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.