ఎన్నికల ఫలితాలు చూస్తూంటే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అనివార్యమని కనిపిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విశ్లేషించారు. ఆమెకే కాదు తెలంగాణ రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వారికి వచ్చే ఎన్నికల నాటికి ఒకటే సీన్ ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులు.
ఉత్తర తెలంగాణలో మారుతున్న సమీకరణాలు
ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఇప్పుడు సీన్ వేగంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకోగా, బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. కేడర్ చెల్లాచెదురవ్వడం, ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు చూడటంతో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోంది. ఈ ఖాళీని బీజేపీ భర్తీ చేస్తూ ఉండటంతో, కాంగ్రెస్ను ఒంటరిగా ఎదుర్కోవడం బీఆర్ఎస్కు కష్టతరంగా మారుతోంది. బీజేపీతో కలిస్తేనే గట్టి పోటీ ఇవ్వగలరు అనే రాజకీయం వచ్చింది.
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హవా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దక్షిణ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ తన పట్టును మరింత బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల ప్రభావం, పట్టణాల్లో అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ప్రతిపక్ష ఓట్లు చీలిపోతే అది కాంగ్రెస్కు మరింత మేలు చేస్తుందని బీజేపీ-బీఆర్ఎస్ భావించి ఎన్నికలకు ముందు అయినా పొత్తులు, కలసి పోటీ చేయడానికి రెడీ అయ్యే అవకాశం ఉంది.
చివరికి బీఆర్ఎస్ ఎదుట ఉండే ఆప్షన్ అదొక్కటేనా?
బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం గ్రేటర్ హైదరాబాద్ , ఉమ్మడి మెదక్ జిల్లాలోనే గట్టి ప్రభావం చూపిస్తోంది. పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలు వంటి అంశాలు పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేశాయి. ఇలాంటి సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలపడం వల్ల రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా కొంత ఊరట లభిస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎప్పుడూ అంచనాలకు అందవు. గతంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన, ఇప్పుడు మారుతున్న రాజకీయ ముఖచిత్రాన్ని బట్టి తన పంథాను మార్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు కుదిరితే, అది రాష్ట్రంలో త్రిముఖ పోటీని ద్విముఖ పోటీగా మారుస్తుంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసి, కాంగ్రెస్కు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
